ముద్రగడ కోసం దాసరి సాహస ప్రయాణం

Update: 2016-02-08 06:24 GMT
కిర్లంపూడిలో చేపట్టిన ముద్రగడ పద్మనాభం దీక్ష చూస్తుంటే తనకు చాలా బాధేస్తోందని కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడను పరామర్శించేందుకు కిర్లంపూడికి బయలుదేరిన తాను దారిలో అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కొన్నానని ఆయన తన ప్రయాణ కష్టాలను చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో బయలుదేరితే సోమవారం ఉదయానికి కానీ రాజమండ్రి చేరుకోలేకపోయానని... కృష్ణా జిల్లా నందిగామ వద్ద తొలుత పోలీసులు అడ్డుకున్నారని దాసరి చెప్పుకొచ్చారు. సోమవారం ఉదయం రాజమండ్రికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడకు మద్దతు తెలిపేందుకు కిర్లంపూడికి వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. నిన్న సాయంత్రం బయలుదేరితే తెల్లవారు జామున రాజమండ్రికి చేరుకున్నానని, పోలీసులు అడుగడుగునా ఇబ్బంది పెట్టారని దాసరి ఆరోపించారు. ''నేను ఈ దేశ పౌరుడినా ? లేక టెర్రరిస్టునా ? .. దీక్ష చేస్తున్న నా స్నేహితుడు ముద్రగడను పలకరించవద్దా'' అని ఆయన తీవ్ర స్వరంతో పోలీసులను ప్రశ్నించారు.  ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతోందని అన్నారు.  ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి రాజమండ్రి  చేరుకున్నానని తెలిపారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డిక్టేటర్ పాలనలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా దాసరి తన ప్రయాణం సాగిన తీరు వివరించారు. అది వింటే దాసరి సాహసమే చేశారనిపిస్తోంది. ''కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు నన్ను అడ్డుకున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చి అక్కడి నుంచి సత్తుపల్లి వచ్చి అడవుల గుండా ప్రయాణించి చివరికి రాజమండ్రి చేరుకున్నాను.. తెల్లవారుజామున 4.45 గంటలకు రాజమండ్రి చేరుకోగలిగాను.. ఇది ఎప్పుడు ఊహించలేదు.. మన రాష్ట్రంలో మనం దొంగల్లా రావాల్సివస్తుందని ఏ రోజూ అనుకోలేదు'' అని దాసరి ఆవేదన వ్యక్తంచేశారు.  నేరస్థులను తరిమినట్లు తనను తరిమి, వెంటాడి అడ్డుకోవడం కరెక్టా అని ఆయన ప్రశ్నించారు.
Tags:    

Similar News