రోజువారీ కేసుల్లో ప్రపంచ హాట్‌స్పాట్ దిశగా ముంబై

Update: 2020-05-26 03:15 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారతదేశాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రారంభంలో కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, మర్కజ్ ఘటన తర్వాత అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త టెన్షన్ పట్టుకుంది. భారత్ 1,44,135 కేసులతో ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. మరణాలు 4,147గా ఉన్నాయి. ఈ కేసుల్లో సగం వరకు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ముఖ్యంగా ముంబై నగరం కరోనా బాధితులకు నిలయంగా మారుతోంది. ఇక్కడ 0.22 శాతం జనాభా వైరస్ బారిన పడిందని తెలుస్తోంది.

ఒకరోజు అత్యధిక కేసులతో ఇప్పటి వరకు ప్రపంచంలోనే రష్యా రాజధాని మాస్కో హాట్ స్పాట్‌గా ఉంది. అక్కడ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కానీ మన వాణిజ్య నగరంలో కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతుంటే ప్రపంచ ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా మారే ప్రమాదం ఉంది. మే 22న ఒక్కరోజే ముంబైలో 1751 కేసులు నమోదయ్యాయి. మాస్కోలో మినహా మరే నగరంలోని ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కాలేదు.

ఇప్పుడు ముంబైలో ప్రతిరోజు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అదే జరిగితే ప్రపంచంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రెండో నగరంగా ముంబై నిలిచే అవకాశముంది. మే నెల మొదటి వారంతో పోలిస్తే ఇప్పుడు కేసులు మూడు రెట్లు ఎక్కువయ్యాయి. ఈ నెల రెండో వారం ముగిసే సమయానికి న్యూయార్క్ నగరాన్ని దాటేసింది. అయితే న్యూయార్క్ జనాభా ముంబైతో పోలిస్తే మూడో వంతు వరకు ఉంటుంది. మాస్కో, బ్రెజిన్‌లోని సావో పౌలో నగరాల్లో జనాభా ముంబైతో సమానంగా ఉంటుంది. ముంబైలో 909, సావో పౌలోలో 678 మంది, మాస్కోలో 1867 మంది చనిపోయారు.
Tags:    

Similar News