అమెరికా లో ఆ వివాదాస్పద చట్టానికి కోర్టు బ్రేక్ !

Update: 2021-10-08 06:45 GMT
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, అబార్షన్లను నిషేధిస్తూ ఇటీవల తెచ్చిన ఓ చట్టం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అక్కడి మహిళల కు ప్రాణసంకటంగా తయారైంది. అయితే, అక్కడి వనితలకు ఊరటనిచ్చేలా అమెరికా న్యాయమూర్తి ఒకరు ఈ చట్టంపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా బైడెన్ ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఈ చట్టంలోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. దీనితో ఏకీభవించిన న్యాయమూర్తి బుధవారం నాడు ఈ చట్టాన్ని నిషేధించారు.

ఈ వివాదాస్పద చట్టం ప్రకారం..గర్భస్థశిశువు గుండె చప్పుడు, పరీక్షల్లో గుర్తించగలిగే స్థితికి పిండం ఎదిగితే అబార్షన్‌ కు అనుమతి ఉండదు. సుమారు ఆరు వారాలకు పిండం ఎదుగుదల ఈ స్థితికి చేరుకుంటుంది. అయితే, ఆరు వారాలు దాటే వరకూ మహిళలు తాము గర్భంతో ఉన్న విషయాన్ని కూడా గుర్తించలేరు. దీంతో ఈ చట్టం వివాదాస్పదంగా మారింది. తమ శరీరాలపై తమకే హక్కు లేకుండా చేస్తున్నారంటూ అక్కడి మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రక్తసంబంధీకుల కారణంగా గర్భం దాల్చినా లేకా, అత్యాచారం కారణంగా తల్లైన సందర్భాల్లోనూ చట్టం బాధితులకు తగిన మినహాయింపులు ఇవ్వకపోవడంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ చట్టం అమెరికా అంతటా కలకలానికి దారితీసింది. అమెరికా మహిళలు వీధుల్లో ఆందోళనకు దిగారు. ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన బైడెన్ ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఎట్టకేలకు కోర్టు తీర్పు మహిళలకు అనుకూలంగా వచ్చింది. ‘‘ఇలా దారుణంగా హక్కులను హరించడాన్ని ఈ కోర్టు ఇకపై అనుమతించదు అని న్యాయమూర్తి తన తీర్పులో వ్యాఖ్యానించారు. అమెరికా సుప్రీంకోర్టు 50 ఏండ్ల కిందటే అబార్షన్ చేయించుకోవడం మహిళల హక్కు అని తీర్పు చెప్పింది. అయితే ట్రంప్ హయాంలో అబార్షన్లను రద్దు చేసే దిశగా చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే 19 రాష్ట్రాల ప్రభుత్వాలు అబార్షన్లను నిషేధిస్తూ 63 చట్టాలు తెచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టుతో పాటు ఆయా రాష్ట్రాల్లోని కోర్టుల్లో ట్రంప్ నియమించిన కన్సర్వేటివ్ జడ్జిలు మహిళల ఆకాంక్షలకు అపోజిట్ డైరెక్షన్లో తీర్పులు చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి.

అమెరికా సుప్రీంకోర్టులో కూడా మహిళలకు అనుకూలంగా నిర్ణయం వచ్చే చాన్స్ లేదని భావిస్తున్నారు. టెక్సస్ చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఇదివరకే తిరస్కరించింది. మిసిసిపీ స్టేట్ లో అబార్షన్ల రద్దుకు వీలుగా 1973 నాటి తీర్పును రద్దుచేసే దిశగా తెచ్చిన చట్టాన్ని రివ్యూ చేసేందుకు అంగీకరించింది. మరోవైపు అబార్షన్ హక్కును సుప్రీంకోర్టు రద్దు చేయకుండా ఫెడరల్ చట్టం తెచ్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించింది. కానీ రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న సెనేట్ లో ఈ బిల్లును అడ్డుకునే సూచనలు కన్పిస్తున్నాయి.


Tags:    

Similar News