భారత్‌ లో 10కి చేరిన కరోనా మరణాలు

Update: 2020-03-23 16:33 GMT
భారత్‌ లో కరోనా మహమ్మారి మరణాల సంఖ్య సోమవారం రాత్రి నాటికి 10కి చేరుకుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌ లోని కాంగ్రాలో 68 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పరీక్షల్లో అతనికి కోవిడ్-19 పాజిటివ్ తేలింది. అతను ఈ రోజు మృత్యువాత పడ్డాడు. అతను టిబెట్ సంతతికి చెందినవాడు. మార్చి  15వ తేదీన అమెరికా నుండి ఢిల్లీకి వచ్చాడు. పరీక్షల్లో పాజిటివ్ తేలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మహారాష్ట్ర - ఢిల్లీ - పశ్చిమ బెంగాల్ - కర్ణాటకలలో పలువురు మృత్యువాత పడ్డారు. ఇటలీ నుండి ఇటీవలే వచ్చిన 55 ఏళ్ళ వ్యక్తి కోల్‌ కతాలో ఈ రోజే మృతి చెందిన విషయం తెలిసిందే. కరోనా కేసులు మార్చి 23 నాటికి 468కి చేరుకున్నాయి. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ సక్సెస్ అయినప్పటికీ ఈరోజు ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్డు మీదకు వచ్చారు. ఇది ఆందోళన కలిగిస్తోంది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు షట్ డౌన్ ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాలు కూడా మార్చి 31వ తేదీ వరకు షట్ డౌన్ ప్రకటించాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ - జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.


Tags:    

Similar News