కరోనా సెకెండ్ వేవ్ : తెలంగాణకి పొంచి ఉన్న పెను ముప్పు .. ప్రభుత్వం అప్రమత్తం !

Update: 2021-02-24 11:30 GMT
దేశంలో మళ్లీ కొంచెం కొంచెంగా కరోనా మహమ్మారి జోరు పెరిగిపోతుండటంతో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమైయ్యాయి. శంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులున్న కేరళ, మహారాష్ట్రల నుంచి వచ్చి, పోయే వారి పట్ల అప్రమత్తంగా వుండాలని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే కర్ణాటక , తమిళనాడు ప్రత్యేక చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసింది. అలాగే తెలంగాణకు పొరుగున వున్న మహారాష్ట్రలోను కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎక్కువగా ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.

మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయి నగరంలో కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. దీనికి కారణం అక్కడ లోకల్ రైళ్ళను నెల రోజుల క్రితం పున: ప్రారంభించడమేనని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ముంబయి నగరంతోపాటు భివాండి, థానే, నవీ ముంబయి, పుణే, ఔరంగాబాద్, నాగ్‌పూర్, అమరావతి, షోలాపూర్, నాందేడ్, యవత్‌ మాల్ నగరాలలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఈ నగరాల నుంచి తెలంగాణలోని పలు జిల్లా కేంద్రాలకు  రాకపోకలు సాగిస్తుంటారు. అక్కడ కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర సరిహద్దులో వున్న నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. దాంతో మహారాష్ట్ర నుంచి ఈ రెండు జిల్లాలకు వచ్చే మార్గాలలో, రహదారులలో ప్రత్యేకంగా చెక్ పోస్టులను పెట్టి థర్మల్ స్క్రీనింగ్ మొదలు పెట్టారు. కానీ , అంత పకడ్బందీగా లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది థర్మల్‌ స్కానింగ్‌ చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారిని ఆసుపత్రికి పంపుతున్నారు. అయితే, ప్రైవేటు వాహనాలపైనా, ద్విచక్ర వాహనాలపైనా వచ్చే వారికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బస్సుల్లోను, రైళ్ళలోను పెద్ద ఎత్తున వస్తున్న వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు. దాంతో పెద్ద ఎత్తున రాకపోకలు సాగే విభాగాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రస్తుతం మహారాష్ట్రకు నిత్యం ఆరు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవికాకుండా వారంలో రెండ్రోజులు నడిచే రైళ్లు మరో నాలుగు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌ స్టేషన్‌ కు రైలు వచ్చిన సమయాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. మహారాష్ట్రలో మొదలైన కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌కు సంబంధించిన ఎన్440కే, ఎన్484కే ఇప్పటికే తెలంగాణకు చేరిందని సిసిఎంబీ పరిశోధనలలో తేలింది.

ఈ కోణంలో చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా ప్రీకాషనరీ స్టెప్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి కేవలం నిజామాబాద్, ఆదిలాబాద్ నగరాలకే కాకుండా తెలంగాణ రాజధాని హైదరాబాద్ కి నిత్యం పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఒకట్రెండు చెక్ పోస్టుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఇవి సరిపోవడం లేదనేది ప్రస్తుతం గ్రౌండ్ పరిస్థితిని పరిశీలిస్తున్నవారు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News