కరోనా ఫోర్త్ వేవ్ కు భయపడాల్సిన పనిలేదు.. కానీ

Update: 2022-06-19 16:30 GMT
ఓ వైపు కరోనా కేసులు జెట్ స్పీడ్తో పెరుగుతున్నాయి. రోజురోజుకు నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే ఫోర్త్ వేవ్ వచ్చిందేమోనన్న భయం ప్రజల్లో కలుగుతోంది. కానీ  వైద్యులు మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కరోనా నాలుగో దశ తో భయపడాల్సిన పనేలేదని తేల్చిచెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. కాకపోతే కరోనా విజృంభించకుండా తగు జాగ్రత్తలు మాత్రం పాటించాలని సూచిస్తున్నారు.

కరోనా మహమ్మారి భారత్ను మరోసారి వణికిస్తోంది. వానాకాలం ప్రారంభం కావడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు. ఓ వైపు సీజనల్ వ్యాధులు.. మరోవైపు కరోనా.. ఇంకోవైపు దాని సబ్ వేరియంట్లతో వణికిపోతున్నారు. రోజురోజుకు జెట్ స్పీడ్లో పెరుగుతున్న కరోనా కేసులను చూస్తుంటే నాలుగో వేవ్ వచ్చినట్లే కనిపిస్తోందని ప్రజలు భావిస్తున్నారు. కానీ వైద్యులు మాత్రం దేశంలో ఫోర్త్ వేవ్ గురించి భయపడాల్సిన పని లేదని చెబుతున్నారు.

భారత్లో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో 13,216 మందికి పాజిటివ్ వచ్చింది. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 2.73 శాతానికి చేరింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,148 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు, హరియాణా, యూపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో పాజిటివిటీ రేటు 15 శాతం దాటడం ఆందోళన కలిగించే అంశం.

భారత్లో పెరుగుతున్న కేసులపై ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం ఫోకస్ పెట్టింది. గత వారం రోజులుగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాల్లో ఎక్కువ మందికి కరోనా పరీక్షలు చేయాలని.. వాటి శాంపిల్స్ తమకు పంపించాలని సూచించింది. కొత్తగా వస్తోన్ కేసుల్లో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల మరో కొత్త వేరియంట్ ఏమైనా వ్యాపిస్తోందా అనేది నిర్ధరించాల్సి ఉందని తెలిపింది. లేదా కరోనా సబ్ వేరియంట్ ఏదైనా మళ్లీ కొత్తగా పుట్టుకొచ్చిందా అనే కోణంలో పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించింది.

మరోవైపు తెలంగాణ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం రోజున  27,841 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 279 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 172 కేసులు హైదరాబాద్లో నమోదవ్వడం ఆందోళన కలిగించే అంశం. ఇక మేడ్చల్‌ జిల్లాలో 20, రంగారెడ్డి 62, కరీంనగర్‌ జిల్లాలో 4 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో ప్రస్తుతం 1,781 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
Tags:    

Similar News