అత్యాచారానికి పాల్ప‌డితే శాశ్వ‌తంగా న‌పుంస‌కులుగా అయిపోతారు ... ఎక్కడంటే ?

Update: 2020-11-26 01:30 GMT
ప్రపంచంలో ఉన్న అతి పెద్ద సమస్యలలో మహిళల పై జరిగే అఘాయిత్యాలు కూడా ఒకటి. ప్రపంచం మొత్తం ఈ సమస్య పట్టిపీడిస్తోంది. మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడకూడదు అని ఎంతగా చెప్తున్నా కూడా కామంతో కళ్ళుమూసుకుపోయిన కొందరు కామాంధులు మహిళలపై అత్యాచారాలకి పాల్పడుతూనే ఉన్నారు. ప్రపంచంలో మహిళలపై జరిగే అత్యాచారాలని అరికట్టాలని ఉద్దేశంతో ఎన్నో దేశాలు కొత్త కొత్త చట్టాలు తీసుకువచ్చాయి , తీసుకువస్తున్నాయి అయినా కామాంధులు వెనక్కి ఏ మాత్రం తగ్గడం లేదు. మ‌న దేశంలో నిర్భ‌య చ‌ట్టం తీసుకొచ్చిన‌ప్ప‌టికీ మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు.

అసలు ఉదయాన్నే ఇంటి నుండి బయటకి వెళ్లిన ఓ ఆడపిల్ల, మళ్లీ ఇంటికి వచ్చే వరకు భయంతోనే ఉంటున్నారు. ఈ మద్యే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ‌లోని హాథ్రాస్ ‌లో ద‌ళిత యువతిపై సాగిన దారుణ సామూహిక హ‌త్యాచారం దేశాన్ని అట్టుడికేలా చేసింది. ఈ ఒక్క ఘటనే కాదు , దేశంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. జరుగుతున్నాయి. ఇక ఏపీలో దిశా చట్టాన్ని తీసుకువచ్చారు , దిశా పోలీస్ స్టేషన్స్ ను పెట్టారు. అయితే మహిళల పై జరిగే అఘాయిత్యాలని మాత్రం తగ్గించేలేకపోతున్నారు.

ఇదిలా ఉండగా పాకిస్థాన్‌ లో అత్యాచారాల‌ను అరిక‌ట్టేందుకు పాక్ ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ట్టాన్ని అమ‌లు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎవరైనా మహిళలపై అత్యాచారానికి పాల్ప‌డితే శాశ్వ‌తంగా న‌పుంస‌కులుగా మార్చే చ‌ట్టాన్ని పాకిస్థాన్ ప్ర‌భుత్వం త్వరలో తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ఈ మేర‌కు పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ‌ఖాన్ సూత్ర‌ప్రాయ అంగీకారాన్ని తెలిపారు. ర‌సాయ‌నాల సాయంతో న‌పుంస‌కులుగా మార్చేలా చ‌ట్టంలో రూపొందించార‌ని తెలుస్తోంది. ఈ చ‌ట్టం ఆ దేశంలో ఎలాంటి ఫ‌లితాలు ఇస్తుందో మరి.
Tags:    

Similar News