కాంగ్రెస్ కు నిధుల కొర‌త‌..ఇంటింటికి వెళ్లాల‌న్న ప్లాన్!

Update: 2018-09-19 05:10 GMT
ప‌దేళ్లు నాన్ స్టాప్ గా అధికారాన్ని అనుభ‌వించిన పార్టీ కాంగ్రెస్‌. ఆ మాట‌కు వ‌స్తే స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత దేశంలో సుదీర్ఘ కాలం ప‌వ‌ర్లో ఉన్న పార్టీ కాంగ్రెస్సే. అలాంటి పార్టీకి ఇప్పుడు తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో ప‌డింద‌ట‌.  ఇప్పుడు ఆ పార్టీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి భారీ ఎత్తున నిధులు స‌మీక‌రించాల‌న్న ల‌క్ష్యాన్ని పెట్టుకుంది.

ఇందులో భాగంగా గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా దేశ వ్యాప్తంగా ప్ర‌తి ఇంటి త‌లుపు త‌ట్టాల‌ని డిసైడ్ చేసింది. పార్టీ కోసం ప్ర‌జ‌ల నుంచి త‌క్కువ మొత్తంలో విరాళాలు సేక‌రించాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌తి ఇంటికి వెళ్లి రూ.5..రూ.10 చొప్పున విరాళాలు పార్టీ కోసం సేక‌రించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న 10 ల‌క్ష‌ల బూత్ ల‌ నుంచి రూ.500 కోట్లు స‌మీక‌రించాల‌న్న‌దే త‌మ ల‌క్ష్యంగా పార్టీ పెట్టుకుంది. ఇప్ప‌టికే పార్టీ బూత్ క‌మిటీ కార్య‌ద‌ర్శ‌ల‌కు పార్టీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్ర‌తి బూత్ క‌మిటీ క‌నీసం రూ.5వేలు స‌మీక‌రించాల‌ని టార్గెట్ గా పెట్టారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌.. తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పార్టీ త‌క్ష‌ణం రూ.500 కోట్లు స‌మీక‌రించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

బూత్ క‌మిటీ స్థాయిలో రూ.5వేల సేక‌ర‌ణ సంగ‌తి ఎలా ఉన్నా..   వాటిని స‌మీక‌రించేందుకురూ.5వేల కంటే ఎక్కువ ఖ‌ర్చు నేత‌ల‌కు ప‌డ‌టం ఖాయ‌మంటున్నారు. అందుకే.. ఇంటింటికి తిరిగే క‌న్నా.. ఐదారు ఇళ్లు తిరిగేసి.. పార్టీకి త‌మ వంతు చందా కింద రూ.5వేలు పంపిస్తే ఒక ప‌ని అయిపోతుంద‌న్న మాట కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News