ఆప్ కు కౌంటర్ మొదలుపెట్టిందా ?

Update: 2021-12-06 05:33 GMT
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ మొదలుపెట్టినట్లే ఉంది. పంజాబ్ లో ఆప్ ను గట్టిగా ఎదుర్కోవాలంటే ఢిల్లీలో కౌంటర్లు గట్టిగా ఉండాలని డిసైడ్ అయినట్లుంది.

అందుకనే ఢిల్లీలో కాంట్రాక్టు టీచర్ల ఆందోళనలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. టీచర్ల ఆందోళనలో సిద్ధూ పాల్గొన్నారు అనేకన్నా ఆందోళనకు సిద్ధూయే నాయకత్వం వహించారనటం సబబుగా ఉంటుంది.

ఎందుకంటే ఆందోళనలు చేసింది టీచర్లే అయినా బాగా హైలైట్ అయ్యింది మాత్రం సిద్ధూయే. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడికి ఢిల్లీ ఆందోళనలతో ఏమిపని ? అన్నదే ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయంట్.

ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే మార్చిలోగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిల్లో పంజాబ్ కూడా ఒకటి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని కొన్ని సర్వేల్లో బయటపడుతోంది. మరి ఎన్నికల్లో గెలిచేపార్టీ ఏమిటంటే ఆప్ అని తేలింది.

117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ సింగిల్ లార్జెస్టు పార్టీగా 51 సీట్లలో గెలవటం ఖాయమని కొన్ని సర్వేలు చెప్పాయి. సర్వేల్లో బయటపడినట్లు 51 సీట్లు తెచ్చుకుంటుందో లేకపోతే పూర్తి మెజారిటి వస్తుందో ఇపుడు ఎవరు చెప్పలేకున్నారు.

ఒకవైపు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంటే మరోవైపు ఆప్ గ్రాఫ్ మెల్లిగానే అయినా పెరుగుతోంది. పోయిన నెలలోనే ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లోని మొహాలీలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ రెగ్యులర్ గా పంజాబ్ లో పర్యటిస్తు హామీలను గుప్పిస్తున్నారు. దాంతో సిద్ధూకి బాగా మండినట్లుంది. అందుకనే ఢిల్లీలో సమస్యల మీద టీచర్లతో కలిసి సిద్ధూ ఆందోళనలో పాల్గొన్నారు. పోయిన ఎన్నికల్లో టీచర్ల నియామకాల్లో కేజ్రీవాల్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటు మండిపోయారు.

8 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 20 కళాశాలలు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని కేజ్రీవాల్ ఎంతవరకు నెరవేర్చారో చెప్పాలని సిద్ధూ డిమాండ్ చేశారు.

మొత్తం మీద పంజాబ్ లో ఆప్ దెబ్బ కాంగ్రెస్ కు పడటం ఖాయమని సిద్ధూ ఆందోళనతో అందరికీ అర్ధమైపోయింది. నిజంగానే పంజాబ్ లో పార్టీని కాపాడుకోవాలని సిద్ధూ అనుకుంటే ముందు పంజాబ్ లో పార్టీ బలోపేతానికి కష్టపడాలి. ఇప్పటికే పార్టీ+ప్రభుత్వానికి సిద్ధూ చాలా డ్యామేజి చేశారు.

మరి చేసిన డ్యామేజీని సిద్ధూ ఎలా ప్యాచప్ చేస్తారో చూడాలి. గడచిన ఆరుమాసాలుగా పంజాబ్ లో పార్టీ+ప్రభుత్వం గబ్బుపట్టడంలో సిద్ధూది కూడా పెద్ద పాత్రే. ఏదేమైనా సిద్ధూ యాక్టివ్ అవటం పార్టీపరంగా హ్యాపీగానే ఉంది.


Tags:    

Similar News