మోడీసార్.. ‘ఆక్సిజన్’ ఆపేస్తారా?
పార్లమెంట్ సమావేశాలకు వేళైంది. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ‘జీరో అవర్’ను అరగంటకే పరిమితం చేయడంపై దుమ్మెత్తిపోశాయి.
తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. పార్లమెంట్ సమావేశాలకు ప్రశ్నోత్తరాల సమయమే ‘ఆక్సిజన్ ’ లాంటిదని.. దానిని నిర్వహించకపోతే ఎలా అని కాంగ్రెస్ ఎంపీ థరూర్ ట్విట్టర్ లో మండిపడ్డారు. కేంద్రం కరోనా పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం దారుణమన్నారు.
ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తే విపక్షాల గొంతునొక్కినట్టేనని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా మండిపడ్డారు. ఇక మహమ్మారి మాటున ప్రజాస్వామ్యాన్ని బీజేపీ హత్య చేస్తోందని తృణమూల్ఎంపీ డేరేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1950 నుంచి ఇలా జరగలేదని నిప్పులు చెరిగారు.