అట్లుంట‌ది మ‌న‌తోటి... కాంగ్రెస్ ముఖ్యుల‌కు జ‌గ్గారెడ్డి ఝ‌ల‌క్‌

Update: 2022-03-07 01:30 GMT
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,  ఎమ్మెల్యే జగ్గారెడ్డి గ‌త కొద్దిరోజులుగా త‌న‌దైన శైలిలో పార్టీ పెద్ద‌ల‌కు షాక్‌లు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. పార్టీకి రాజీనామా చేసేయ‌డం, కార్య‌క‌ర్త‌ల‌తో వ్య‌క్తిగ‌త స‌మావేశాలు వంటి ట్విస్టులు ఎన్నో ఇస్తున్నారు. కొద్దిరోజులుగా సంయ‌మ‌నం పాటిస్తున్న జ‌గ్గారెడ్డి తాజాగా మ‌ళ్లీ పార్టీ పెద్ద‌ల‌కు షాక్ ఇచ్చారు.

సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ నిర్వహించారు. అయితే, జ‌గ్గారెడ్డి హ‌ఠాత్తుగా సీఎల్పీ సమావేశాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ నిర్వహించారు. అయితే, ఈ స‌మావేశంలో జ‌గ్గారెడ్డికి త‌న వాద‌న వినిపించే ప‌రిస్థితి రాలేద‌ని స‌మాచారం. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని భట్టి విక్రమార్కతోపాటు కుసుమకుమార్ సూచించడంతో జగ్గారెడ్డి అసంతృప్తికి లోనయ్యారు.

ఇంతకు ముందు కూడా చాలా సార్లు అవమానాలు జరిగాయని.. ఇప్పుడూ జరుగుతున్నాయని పేర్కొంటూ సమావేశాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోతున్నానని చెప్పారు. తనను ఎవరూ  అవమానించలేరని.. తాను  ఎవరికింద  ఉద్యోగిని  కాదని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిపై సీఎల్పీ సమావేశంలో  చర్చించాలని అనుకున్నాన‌ని, అయితే భట్టి విక్రమార్క, కుసుమ కుమార్ సూచన మేరకు ఇక్కడ  మాట్లాడవద్దని  నిర్ణయించుకున్నానన్నారు.  అందుకే  సమావేశాన్ని వీడుతున్నానని చెప్పారు.

సీఏల్పీ నేత భట్టి విక్రమార్క,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో  జగ్గారెడ్డికి కొన్ని ఇబ్బందులున్నాయని,తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. జగ్గారెడ్డి రాజీనామా చేయకుండా సముదాయించామని, ఆయన లేవనెత్తిన అంశాలపై అధిష్టానంతో మాట్లాడుతామని తెలిపారు.

జగ్గారెడ్డి కార్యకర్తల సమావేశానికి రాజీనామాకు  సంబందం లేదని..ఆయన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారనే అనుకుంటుంన్నాం అని అన్నారు. కాగా, ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త వ‌చ్చిన అంశాల‌ను మ‌ళ్లీ అసెంబ్లీ స‌మావేశాల ముందు లేవ‌నెత్త‌డంతో ఇత‌ర నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో జ‌గ్గారెడ్డి నొచ్చుకున్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News