త‌మ ప‌ద‌వుల‌కు ముగ్గురు కాంగ్రెస్ నేత‌ల రాజీనామా!

Update: 2022-10-02 10:16 GMT
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఓవైపు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది. మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్ష ప‌ద‌వికి సుదీర్ఘ‌కాలం త‌ర్వాత ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి ముగ్గురు నేత‌లు నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మాజీ కేంద్ర మంత్రి, రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ప్ర‌తిపక్ష నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్‌, జార్ఖండ్‌కు చెందిన మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. అయితే కేఎన్ త్రిపాఠి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌యింది. దీంతో మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, శ‌శిథ‌రూర్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు.

దీంతో వీరిద్ద‌రిలో ఎవ‌రు గెలిచినా పీవీ న‌ర‌సింహారావు త‌ర్వాత కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్షిణ భార‌త‌దేశానికి చెందిన నేత‌కు ద‌క్క‌నుంది. త‌ద్వారా మ‌ల్లిఖార్గున ఖ‌ర్గే లేదా శ‌శిథ‌రూర్ రికార్డు సృష్టిస్తారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికైతే తాము ఏం చేస్తామనేది.. పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారనే విషయాలను ఇద్ద‌రు నేత‌లు ప్రచార ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో శశిథరూర్ ఒక అడుగు ముందుకేసి తన మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు.

ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్‌కు ముగ్గురు అధికార ప్రతినిధులు రాజీనామా చేశారు. దీపేందర్ హుడా, సయ్యద్ నాజర్ హుస్సేన్, గౌరవ్ వల్లభ్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. తమ రాజీనామా పత్రాలను పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి పంపారు.

త‌మ‌ రాజీనామాకు కారణాలను కూడా ఈ ముగ్గురు అధికార ప్ర‌తినిధులు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే గెలవడానికి అవసరమైన ప్రచార కార్యక్రమాలను తాము చేపట్టాల్సి ఉందని.. అందుకే రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఢిల్లీలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో క‌లిసి ముగ్గురు మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌రిగే ఎన్నిక‌ల్లో ఖ‌ర్గే త‌ర‌ఫున అన్ని రాష్ట్రాల్లో ప్ర‌చారం నిర్వ‌హిస్తామ‌ని దీపేందర్ హుడా, సయ్యద్ నాజర్ హుస్సేన్, గౌరవ్ వల్లభ్ వెల్ల‌డించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే ఉద‌య్‌పూర్ డిక్ల‌రేష‌న్ మేర‌కు పార్టీ నిబంధనకు కట్టుబడి త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశామ‌ని తెలిపారు.
పార్టీ అధికార ప్రతినిధులుగా ఉంటూ మల్లిఖార్జున ఖర్గే తరఫున ఎన్నికల ప్రచారం నిర్వ‌హించ‌కూడ‌ద‌ని పార్టీ నిబంధన ఉంద‌న్నారు. దశలవారీగా అన్ని రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామ‌న్నారు.

మ‌రోవైపు ఒక వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి లెక్క‌న తాను కూడా రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు తనకు అండగా ఉంటాయని తెలిపారు.

కాగా కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి అక్టోబ‌ర్ 17న ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. అక్టోబ‌ర్ 19న ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. అయితే అధిష్టానం మ‌ద్ద‌తు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న ఎన్నిక లాంఛ‌న‌ప్రాయ‌మేన‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News