కాంగ్రెస్ షాకిచ్చింది!... బాబెవ‌రితో క‌లుస్తారో?

Update: 2019-01-23 14:08 GMT
మ‌రో మూడు, నాలుగు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీకి గ‌ట్టి షాక్ త‌గిలింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే ఎన్నిక‌ల‌కు వెళుతున్న ఆ పార్టీ అదినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఆశ‌ల‌పై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ నీళ్లు చ‌ల్లేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో జ‌త క‌ట్టేది లేద‌ని కాంగ్రెస్ పార్టీ చాలా క్లియ‌ర్‌ గా ప్ర‌క‌టించేసింది. పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యం మేర‌కే తాము ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్నామ‌ని ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డితో పాటు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ ఊమెన్ చాందీ పేర్కొన్నారు. ఇప్ప‌టికే భారీ ఎత్తున ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మూట‌గట్టుకున్న టీడీపీ స‌ర్కారు... వ‌చ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని తీరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు చెబుతున్నాయి.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో త‌మ విజ‌యానికి కార‌ణంగా నిలిచి... ఇప్పుడు త‌మ‌నే విమ‌ర్శిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను త‌మ వైపు లాగేసుకునేందుకు టీడీపీ నేత‌లు, చివ‌ర‌కు చంద్ర‌బాబు స్వ‌యంగా చేస్తున్న య‌త్నాలు ఈ వాద‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పక త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పొత్తుల‌ను ఖరారు చేసుకునే ప‌నిలో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ సిద్ధాంతాల‌ను ప‌క్క‌న‌పెట్టేసిన చంద్ర‌బాబు... కాంగ్రెస్ తో జ‌ట్టు క‌ట్టారు. అయితే ఈ పొత్తును అప‌విత్ర పొత్తుగానే భావించిన తెలంగాణ ప్ర‌జ‌లు ఇటు టీడీపీతో పాటుగా అటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ ను కూడా గ‌ట్టిగానే దెబ్బ కొట్టేశారు. ఈ దెబ్బ నుంచి తేరుకునేందుకు కాంగ్రెస్‌ కు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింద‌ని చెప్పాలి. అయితే ఇలాంటి ఈస‌డింపుల‌ను చాలా లైట్ గా తీసుకునే చంద్ర‌బాబు... ఏపీలోనూ క‌లిసే ముందుకు సాగుదామంటూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు.

ఉత్త‌రాది ప్ర‌యాణానికి వెళుతున్న చంద్ర‌బాబు... రాహుల్ ను క‌ల‌వ‌కుండా వెన‌క్కు రావ‌డం లేదు. నిన్న కూడా చంద్ర‌బాబు.. రాహుల్ ను ఢిల్లీలో క‌లిశారు. పొత్తుల‌పై మాట్లాడారు. చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌ల‌కు రాహుల్ సానుకూలంగానే స్పందిస్తున్నార‌ని కూడా చంద్ర‌బాబు అనుకూల మీడియా త‌న‌దైన శైలి క‌థ‌నాల‌ను రాసింది. అయితే ఈ ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు లేనే లేద‌ని, ఏపీ ఎన్నిక‌ల‌తో పాటు లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను కూడా సింగిల్‌ గానే ఎదుర్కొంటామ‌ని ర‌ఘువీరా, చాందీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ సీట్ల‌తో పాటు 25 లోక్ స‌భ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగుతార‌ని కూడా వారు ప్ర‌క‌టించేశారు. ఇప్ప‌టిదాకా కాంగ్రెస్‌ తో క‌లిసి వెళ్లి జ‌గ‌న్ ఓటు బ్యాంకును చీల్చ‌వ‌చ్చ‌న్న చంద్ర‌బాబు య‌త్నాలు ఈ ప్ర‌క‌ట‌న‌తో ఒక్క‌సారిగా గంగ‌లో క‌లిసిపోయాయి. మొత్తంగా చంద్ర‌బాబును వ‌దిలేస్తున్నామ‌ని చెప్పిన ర‌ఘువీరా, చాందీలు... టీడీపీకి గ‌ట్టి షాకిచ్చిన‌ట్లుగానే చెప్పుకోవాలి.
Tags:    

Similar News