ఈటల ఢిల్లీ పర్యటనలో ఒరిగేదేమీ ఉండదా?

Update: 2021-05-31 10:34 GMT
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యేందుకు మాజీ మంత్రి ఈటల దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లటం తెలిసిందే. తొలుత నడ్డాతో.. సమయం ఉండే కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. ఈటలకు సంబంధించిన ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నియంత కేసీఆర్ ను గద్దె దించేందుకు అన్ని పక్షాలు ఏకం కావాలని వ్యాఖ్యానించటం గమనార్హం.
కిషన్ రెడ్డి వ్యాఖ్యల్నిచూస్తుంటే.. ఈటల బీజేపీలో చేరేందుకు ఇంకా డిసైడ్ కాలేదా? అన్న సందేహం కలుగుతోంది. ఎందుకంటే.. తొలుత వచ్చిన వార్తల ప్రకారం కిషన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళతారని పేర్కొన్నారు. కానీ.. ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు. మరోవైపు ఈటలను బీజేపీలో చేరొద్దంటే చేరొద్దంటూ కొన్ని వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారు.

ఒకవేళ అలాంటి వారి సలహాల్ని.. సూచనల్ని పరిగణలోకి తీసుకోకుండా బీజేపీలోకి చేరితే..ఈటలకు వారంతా వ్యతిరేకం అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే.. ఆయన బీజేపీలో చేరకుండా సొంతంగా పార్టీ పెట్టాలన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటల బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకోవటానని వెనుకబడిన వర్గాలు.. మైనార్టీలతో పాటు.. వామపక్ష వాదులు వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో మోడీ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతున్న వేళలో.. బీజేపీలో చేరటం ద్వారా తొందరపడుతున్నానన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇలాంటి వేళ.. ఈటల ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్లు అంటే.. అందుకు వేరే కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తనపై కబ్జా ఆరోపణలతో పాటు.. రానున్న రోజుల్లో దర్యాప్తు సంస్థలతో కొత్త తరహా వేధింపులు షురూ అవుతాయని.. ఇలాంటివేళ.. తనకు సాయంగా నిలవాలన్న వినతిని వారి ముందు ఉంచాలన్న యోచనలో ఈటల ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా పార్టీలో చేరే కన్నా.. ఇతరత్రా అంశాలే వారి భేటీలో వచ్చే వీలుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News