బరాబర్.. మా పండుగ మేం చేసుకుంటాం

Update: 2020-11-12 11:10 GMT
పండగ వస్తుందంటే అదోలాంటి సంతోషం. ఇప్పుడది ఆవిరి అవుతోంది. పండుగ వస్తుందంటే చాలు.. పిచ్చ.. పిచ్చ సిద్ధాంతాలు చెప్పి.. ప్రతి దానికి పర్యావరణం పేరుతో చెప్పే కాకమ్మ కబుర్లు వింటుంటే కడుపు మండిపోతోంది. ఈ భూగోళంలో మరే పండగలకు జరగనంత రాద్దాంతం మా పండగలకే ఎందుకన్న మాట ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. సంక్రాంతి నుంచి మొదలై దీపావళి వరకు ప్రతి పండక్కి ఏదో ఒక లొల్లి.

మిగిలిన పండగలకు లేని లెక్కలు.. మా పండగలకే ఎందుకు వస్తాయి? పటాసులు కాలిస్తే ఏం వస్తుంది? డబ్బుల్ని కాల్చినట్లే? అని ఒకడి తీర్మానం. అదే నిజమనుకుందాం.. సినిమాకు వెళితే ఏం వస్తుంది? అందుకోసం అన్నేసి డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలి? అసలుసినిమా అన్నది ఎంత పొలుష్యన్ చెప్పండి? సౌండ్ పొల్యూషన్. ఇప్పుడైతే థియేటర్లు లేవు కానీ. అదే విడి రోజుల్లో అయితే.. సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్లటం.. ఒక్కో షోకు తక్కువలో తక్కువ 500 మంది అంటే.. 250 వెహికిల్స్. యావరేజ్ ను ఊళ్లల్లో రెండు కిలోమీటర్లు.. పట్టణాల్లో ఐదు కిలోమీటర్లు.. నగరాల్లో ఇరవై కిలోమీటర్లు సినిమా కోసం వెళ్లాలి.

దాని కారణంగా జనరేట్ అయ్యే కాలుష్యం మాటేమిటి? థియేటర్ కు వెళ్లి ఉత్తినే కూర్చుకోకుండా ఏదో ఒకటి తినటం.. తాగటం.. దాని వల్ల జనరేట్ అయ్యే చెత్త కారణంగా పర్యావరణానికి ఎంత నష్టం? ఇలా లెక్కేలేసుకుంటే మనిషి నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. దానికి తగ్గట్లు అంతో ఇంతో చెత్త ప్రొడ్యూస్ అవుతుంది. నిజంగా పర్యావరణాన్ని బాగు చేయాలంటూ క్లాసులు పీకేటోళ్లందరు పెట్రోల్.. డీజిల్ బండ్లు వాడకుండా కేవలం సైకిళ్లు మాత్రమే వాడాలి.

వారి ఇళ్లల్లో ఏసీలు.. ఫ్రిజ్ లు.. వాషింగ్ మెషిన్లు లాంటివి అస్సలు వాడకూడదు. వాటి కారణంగా అయ్యే జనరేట్ అయ్యే పొల్యుషన్ తో భూమండలానికి జరిగే నష్టం అపారం. మరి.. ఇవన్నీ చేయకుండా కొంతమంది చేసుకునే పండుగలకు జరిగే నష్టం మీద పిచ్చ లెక్కలు ఎందుకు? ఎవడి డబ్బులు వాడి ఇష్టం. నా పటాసులు నేనే కొనుక్కుంటున్నా కానీ.. ఎవరి డబ్బులో తీసుకొని కాల్చటం లేదు కదా?

అయినా.. ఎవరికి వారికి వారి మతాచారాల్ని పాటించే హక్కు ఉన్న ఈ దేశంలో.. కొన్ని పండగులే టార్గెట్ అవుతాయి ఎందుకు? మొన్ననే పేపర్లో చదివాం. అక్కడెక్కడో అమెరికాలో మన తెలుగమ్మాయి ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కావటమే కాదు.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఘనంగా దీపావళి జరుపుకున్నారు.

అలా దేశం కాని దేశంలో మన పండుగల్ని జరుపుకోవటానికి ఉత్సాహాన్ని చూపిస్తుంటే..మనకేదో పోయేరోగం వచ్చినట్లుగా ప్రతి పండక్కి చిత్రగుప్తుడి చిట్టా మాదిరి లెక్కలు రాయటంలో అర్థముందా? నీతులు చెప్పే నోళ్లు.. కాస్త మూసేస్తే.. ఎవడికి నచ్చినట్లు వాడు బతుకుతాడు కదా? ఒకవేళ.. నిజంగానే నష్టం జరిగితే.. అందరి పండగుల లెక్కలు తీయాలి. అందరి విషయాల్లోనూ పరిమితులు విధించాలి. చట్టం ముందు అందరూ సమానులే కదా?

వినాయకచవితి కావొచ్చు.. దీపావళి కావొచ్చు.. సంక్రాంతి కావొచ్చు. ప్రతి పండక్కి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. దీపావళి టపాసుల్లో ఉండే భాస్వరం.. అక్టోబరు.. నవంబరు వేళలో వచ్చే కీటకాల్ని చంపేందుకు ఉద్దేశించింది. ఇంకాస్త లోతుల్లోకి వెళితే.. మరెన్నో విషయాలు బయటకు వస్తాయి. వాటిని వదిలేసి.. గుడ్డు మీద ఈకలు పీకే తీరు మార్చుకుంటే బాగుంటుంది. దీపావళి చేసుకునే వారికి మనోభావాలు ఉంటాయన్న విషయాన్ని వికార మనస్తత్వగాళ్లకు అర్థమయ్యే ఛాన్సు ఉండదు కదా?
Tags:    

Similar News