దుర్గ‌మ్మ గుడి నుంచి వ‌స్తూ ఆగిన కేసీఆర్ కాన్వాయ్!

Update: 2019-06-17 11:33 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో చాలా కోణాలు క‌నిపిస్తాయి. నిశితంగా చూస్తే.. ఆయ‌న ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విష‌యం ఆయ‌న స‌న్నిహితుల‌కు కూడా ఒక ప‌ట్టాన అర్థం కాదు. నిత్యం ఆయ‌న వెంట ఉండే వ్య‌క్తుల‌కు.. ఉన్న‌ట్లుండి నెల‌ల పాటు ఆయ‌న ద‌ర్శ‌నం కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి. బ‌య‌టేమో.. మీకేమండి..

సీఎం కేసీఆర్ వెంటే ఉంటార‌ని పొగిడేస్తుంటే.. స‌ద‌రు నేత‌లు నోట మాట రాక‌.. త‌మ ఇబ్బందిని బ‌య‌ట‌కు చెప్పుకోలేక కిందామీదా ప‌డుతుంటారు.  కొన్నిసార్లు క‌ఠినంగా.. కొన్నిసార్లు ఉదారంగా వ్య‌వ‌హ‌రించే కేసీఆర్ లో మంచి భావ‌కుడు ఉన్న విష‌యం తెలిసిందే. అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌కు వచ్చే ఆయ‌న తీరు ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. తాజాగా ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేసీఆర్ లో నుంచి అలాంటి భావ‌కుడు ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వచ్చిన వైన‌మిది.  కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం నేప‌థ్యంలో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఆహ్వానించేందుకు బెజ‌వాడ‌కు వెళ్లిన కేసీఆర్‌.. జ‌గ‌న్ తో భేటీకి ముందు దుర్గ‌మ్మను ద‌ర్శించుకోవ‌టం తెలిసిందే. గుడిలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం ఇన్విటేష‌న్ ను దుర్గ‌మ్మ పాదాల వ‌ద్ద ఉంచి పూజ‌లు చేయించారు. అనంత‌రం గుడి నుంచి జ‌గ‌న్ నివాసానికి బ‌య‌లుదేరారు.

గుడి నుంచి కింద‌కు వ‌చ్చిన కేసీఆర్ కాన్వాయ్.. ప్ర‌కాశం బ్యారేజీ మీదుగా వెళుతున్న వేళ‌.. కేసీఆర్ త‌న కాన్వాయ్ ను ఆపారు. కారులో నుంచి కింద‌కు దిగిన ఆయ‌న‌.. బ్యారేజీని.. నీటి ప్ర‌వాహ‌నాన్ని ప‌రిశీలించారు. అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని కాసేపు అస్వాదించారు. అనంత‌రం కారులో ఎక్కిన ఆయ‌న జ‌గ‌న్ ఇంటికి వెళ్లారు. నీళ్ల‌ను చూసినంత‌నే కేసీఆర్ తీవ్ర ఉద్వేగానికి గురి అవుతుంటారని చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే కృష్ణ‌మ్మ‌ను చూసినంత‌నే కాసేపు ఆగిన కేసీఆర్ తీరు చూసిన వారంతా.. ఆయ‌న‌కు నీటి మీద ఉన్న ఇష్టాన్ని తాజా ఉదంతం ఇట్టే చెప్పేస్తుంద‌న్న మాట వినిపించింది.


Tags:    

Similar News