జగన్.. చిరు విందు భేటీలో ఏం జరగనుంది?

Update: 2019-10-14 05:20 GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి మధ్య భేటీ కాస్తా.. విందు సమావేశంగా మారింది. ఇటీవల తాను నటించిన సైరా చిత్రాన్ని చూడాల్సిందిగా సీఎం జగన్ ను ఆహ్వానించేందుకు టైం కోరటం.. తర్వాత ఢిల్లీకి వెళ్లాల్సిన కారణంగా భేటీ క్యాన్సిల్ కావటం తెలిసిందే. తాజాగా చిరంజీవిని మధ్యాహ్నం లంచ్ భేటీకి ఏపీ సీఎం జగన్ కోరారు.

సచివాలయంలో తన అధికారిక షెడ్యూల్ ముగిసిన తర్వాత ఈ మధ్యాహ్నం 12.40 గంటలకు సెక్రటేరియట్ నుంచి ఇంటికి రానున్నారు. మధ్యాహ్నం 1.10 గంటల వేళలో చిరు.. ఆయన తనయుడు రాంచరణ్ లు కలిసి ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు. వీరి భేటీ మొత్తానికి సంబంధించి బాధ్యతను మంత్రి కన్నబాబుకు అప్పజెప్పారు. ఒకప్పుడు ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా.. అంతకు ముందు ఈనాడులో సీనియర్ జర్నలిస్టుగా వ్యవహరించిన ఆయన.. ప్రస్తుతం జగన్ సర్కారులో మంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంతకీ ఏపీ సీఎంతో చిరు భేటీ కాస్తా.. విందు సమావేశంగా ఎందుకు మారిందన్నది ఇప్పుడు ఆసక్తికరమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వీరి విందు భేటీ సందర్భంగా కొన్నికీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు పడే వీలుందని చెబుతున్నారు. దాదాపు గంటన్నర పాటు సాగే ఈ భేటీలో జగన్ కీలక ప్రతిపాదన ఒకటి చిరు ముందు పెట్టనున్నట్లు చెబుతున్నారు.

సినీ పరిశ్రమ ఏపీలో స్థిరపడటానికి వీలుగా ప్రభుత్వం తరఫున ఏదైనా నామినేటెడ్ పదవి కానీ.. ఇంకేదైనా బాధ్యతను చిరుకు అప్పగించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చిరంజీవి ఎప్పుడు జగన్ ను ఉద్దేశించి పల్లెత్తు మాట అన్నది లేదు. ఇటీవల ఏపీలో సాహోతో సహా మరే చిత్రానికి స్పెషల్ షో ఇచ్చేందుకు ఓకే అనని జగన్.. చిరు నటించిన సైరా మూవీకి మాత్రం స్పెషల్ షోకు పర్మిషన్ ఇవ్వటాన్ని మర్చిపోలేం.

అంతేకాదు.. ఇటీవల తాడేపల్లిగూడెంలో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణను మెగాస్టార్ చేతులు మీదుగా జరిపేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో అధికారిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చిరుకు పెద్దపీట వేశారు. అదే సమయంలో చిరంజీవి సైతం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది. మరోవైపు.. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టాలీవుడ్ కు చెందిన మా పెద్దలతో పాటు చిత్రరంగ ప్రముఖులు ఎవరూ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసింది లేదు. ఎంత విపక్షానికి దగ్గరగా ఉంటే మాత్రం.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా కలకుండా ఉంటారా? అన్న విరుపులు మొదలయ్యాయి.

ఇలాంటివేళ.. ఏపీలో చిత్రపరిశమ్రను డెవలప్ చేయటానికి వీలుగా చిరంజీవికి ప్రభుత్వ పరంగా బాధ్యత అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదేజరిగితే కొత్త సమీకరణాలకు తెర తీసినట్లు అవుతుందంటున్నారు. ఇక.. చిరుతో తమ్ముడు పవన్ కు సైతం సానుకూల సంకేతాల్నిపంపేందుకు వీలుంటుందంటున్నారు. ఏమైనా.. జగన్-చిరు భేటీ కీలక నిర్ణయాలకు అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News