కేంద్రంలో మోడీ సర్కారు రాదనే కేసీఆర్ లెక్క ఇదే!

ఇలాంటి వేళ.. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఎవరిది? అన్న దానిపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.

Update: 2024-05-07 09:30 GMT

రాజకీయాల్లో ఉన్నప్పుడు.. అందునా ఎన్నికల వేళలో ఎవరికి వారు వారి అంచనాల్ని వెల్లడిస్తుంటారు. అడిగినా.. అడగకున్నా.. తన వ్యూహంలో భాగంగా కొన్ని సందర్భాల్లో ఎన్నికల్లో గెలుపుపై గులాబీ బాస్ కేసీఆర్ చెబుతుంటారు. గతంలో ఆయన చెప్పిన ఎన్నికల జోస్యాలు వాస్తవ రూపం దాల్చేవి. కానీ.. గడిచిన కొంతకాలంగా ఆయన అంచనాలన్ని తప్పుతున్నాయి. ఆయన చెప్పిన రాజకీయ జోస్యాలేవీ వాస్తవ రూపం దాల్చని పరిస్థితి.

ఇలాంటి వేళ.. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఎవరిది? అన్న దానిపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ సర్కారుగా పేర్కొన్న కేసీఆర్.. ఎన్డీయేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాదన్న లెక్క ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు వెలువడిన ఏ పోల్ సర్వే అయినా.. మోడీ సర్కారు ఖాయంగా కేంద్రంలో కొలువుతీరుతుందన్న విషయాన్ని వెల్లడించాయి.

అయితే.. మోడీ అండ్ కో కోరుకున్నట్లుగా బీజేపీకి సొంతంగా 370 సీట్లు.. కూటమితో కలిపి 400 ప్లస్ సీట్లు రావటంపై సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారే తప్పించి.. అధికారం మాత్రం ఖాయమని స్పష్టం చేయటం తెలిసిందే. అందుకు భిన్నంగా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయి. ఆయన లెక్కలేమంటే.. మహారాష్ట్ర.. బిహార్.. పశ్చిమ బెంగాలలో బీజేపీ తుడిచి పెట్టుకుపోతుందని.. దక్షిణ భారతదేశంలోనూ బీజేపీకి వచ్చే సీట్లు అంతంతమాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ మాటల్ని పరిగణలోకి తీసుకుంటే.. పశ్చిమ బెంగాల్ లో సీట్లు కాస్త తక్కువ రావొచ్చు కానీ బిహార్ లో ఆయన అంచనాలు తప్పయ్యే వీలుందంటున్నారు. మహారాష్ట్రలో కేసీఆర్ అంచనా వేసినంత దారుణంగా సీట్ల సంఖ్య పడిపోదన్న మాట వినిపిస్తోంది.

Read more!

కర్ణాటకలో సీట్లు వస్తాయనుకున్నా.. ఇటీవల కాలంలో వెలుగు చూసిన కుంభకోణంలో ఆ పార్టీ భయంకరంగా దెబ్బ తిందన్న కేసీఆర్ మాటల్లో కొంత నిజం ఉన్నా.. పూర్తి నిజం లేదని చెప్పాలి. దక్షిణాదిలో బీజేపీకి 10-12 సీట్లు వస్తే గొప్ప అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. అందులో నిజం లేదంటున్నారు. కారణం.. తెలంగాణలోనే బీజేపీకి ఐదారు సీట్లు వచ్చే వీలుందని.. ఏపీలో రెండు ఖాయమని.. తమిళనాడులో రెండు.. మూడు కర్ణాటకలో కనీసం సగం సీట్లు వచ్చే వీలుంది. కేరళను వదిలేసినా.. కూడా 15-20 సీట్లు ఖాయంగా వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.

ఇక.. కూటమి విషయానికి వస్తే ఏపీలో ఎక్కువ సీట్లకు అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఏపీలో కూటమి ఫెయిల్ అయినా.. వైసీపీకి భారీగా ఎంపీ సీట్లు దక్కిన పక్షంలో.. 2019 తర్వాత కేంద్రంతో జగన్ ఏ రీతిలో వ్యవహరించారో.. ఈసారి అలాంటి రోల్ పోషిస్తారని చెబుతున్నారు. ఈ అంశాల్నిపరిగణలోకి తీసుకుంటే కేసీఆర్ అంచనాలు తప్పు కావటం ఖాయమంటున్నారు. తెలంగాణలో తమ పార్టీ గెలిచే సీట్లు 10-12గా చెప్పుకుంటున్న కేసీఆర్.. కనీసం మూడు నాలుగు సీట్లను సొంతం చేసుకున్నా.. మహా సక్సెస్ అయినట్లేనని చెబుతున్నారు. జోస్యాలు చెప్పే కేసీఆర్.. తమ పార్టీ సాధించే సీట్ల సంఖ్య పెరిగేందుకు సరైన ప్లానింగ్ చేస్తే బాగుంటుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News