చైనా వక్రబుద్ధి: చర్చలంటూనే సరిహద్దుల్లో హెలిప్యాడ్ నిర్మాణం, బలగాల మోహరింపు

Update: 2020-06-27 07:01 GMT
ఒకవైపు చర్చలు చేస్తూనే మరోవైపు చైనా కుయుక్తులు పన్నుతోంది. ఆ దేశం వకబుద్ధి ఏమాత్రం మారలేదు. సరిహద్దు వద్ద నిర్మాణాలు, బలగాల మోహరింపు చేస్తోంది. ఈ క్రమంలోనే తూర్పు లడాఖ్ ఘర్షణ తర్వాత ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇరు దేశాల మిలిటరీ హై కమాండర్ల మధ్య చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో సరిహద్దులో హెలీప్యాడ్ నిర్మిస్తూ.. బలగాలను మోహరిస్తూ పరిస్థితిని మరింత ఉద్రిక్తతకు దారితీసేలా చైనా వ్యవహరిస్తోంది. ప్యాంగ్యాంగ్ లేక్ వద్ద బలగాలను భారీగా మోహరించింది.

ఈ క్రమంలోనే ఫిగర్ 4 వద్ద చైనా హెలీప్యాడ్‌ నిర్మాణాన్ని చేపట్టింది. ప్యాంగ్యాంగ్ లేక్ దక్షిణ ఒడ్డున చైనా భారీ బలగాలను దింపింది. దీంతో చైనా ఇంకా కయ్యానికి కాలు దువ్వుతున్నట్టే ఉంది. బలగాలు వెనక్కి తీసుకెళ్లేలా పరిస్థితి కనిపించడం లేదు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద చైనా నిర్మాణాలు చేపడుతోందని భారత అధికారులు కూడా గుర్తించారు. చైనాకు గట్టి బదులు ఇచ్చే యోచనలో భారత్ ఉంది.

నెలన్నర రోజులుగా చైనా వేగంగా సరిహద్దుల వద్ద నిర్మాణం, హెలిప్యాడ్ నిర్మాణం, బలగాల మొహరింపు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపట్టిందని గుర్తించారు. చైనాను ఎదుర్కొనేందుకు బలగాలతో సిద్ధంగా ఉన్నామని.. కానీ సరిహద్దు ప్రాంతంలో విధించిన పరిమితుల మేరకు ఆగిపోయామని ఈ సందర్భంగా ఓ సైనిక అధికారి వివరించారు. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు నడుచుకొంటామని స్పష్టం చేశారు. కానీ వాటిని ఉల్లంఘిస్తోందని తెలిపారు.
Tags:    

Similar News