పశ్చిమాసియా యుద్ధం తెచ్చిన చమురు మంట.. జేబులకు చిల్లు పడనుందా?

ప్రపంచంలో ఏదో ఒక మూల అలజడి సర్వసాధారణం.. ఎక్కడో దూరంగా ఉన్న దేశాల మధ్య యుద్ధం జరిగితే మనకేంటి అని చాలాసార్లు అనుకుంటాం.. కానీ, నేటి ప్రపంచం చాలా విషయాలలో ఒక దేశంతో మరో దేశం లింకై ఉంది.;

Update: 2026-03-02 10:30 GMT

ప్రపంచంలో ఏదో ఒక మూల అలజడి సర్వసాధారణం.. ఎక్కడో దూరంగా ఉన్న దేశాల మధ్య యుద్ధం జరిగితే మనకేంటి అని చాలాసార్లు అనుకుంటాం.. కానీ, నేటి ప్రపంచం చాలా విషయాలలో ఒక దేశంతో మరో దేశం లింకై ఉంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ విషయంలో ఇది అక్షరాలా నిజం. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న గొడవల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా 10 శాతం మేర పెరిగాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభం కాగానే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 82 డాలర్ల పైకి చేరింది. 2025, జనవరి తర్వాత ఇదే అత్యధిక ధర అంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

హర్ముజ్ జలసంధి..

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ‘హర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz). ఇది ఒమన్, ఇరాన్ మధ్య ఉండే ఇరుకైన సముద్ర మార్గం. ప్రపంచం మొత్తం వాడుతున్న చమురులో 20 శాతం, సహజ వాయువులో 20 శాతం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్ వంటి దేశాల నుంచి చమురు రావాలంటే ఈ దారి తప్పనిసరి. ఇప్పుడు ఇరాన్ ఈ మార్గంలో నౌకల రాకపోకలను అడ్డుకోవడమే కాకుండా, మూడు చమురు ట్యాంకర్లను దెబ్బతీశామని ప్రకటించింది. దీంతో సరఫరా నిలిచిపోతుందనే భయం మార్కెట్‌ను కుదిపేస్తోంది.

భారత్ మీద పడే భారమెంత?

ప్రపంచంలో చమురును అత్యధికంగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. మన దేశానికి రోజుకు 5.5 మిలియన్ల బ్యారెళ్ల చమురు అవసరం. అందులో 2 మిలియన్ల బ్యారెళ్లు ఈ హర్ముజ్ జలసంధి నుంచే వస్తుంది. మనం రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకున్నాక, మళ్లీ పశ్చిమాసియా దేశాల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాం.

ఇక్కడ మనం గమనించాల్సిన షాకింగ్ నిజం ఏంటంటే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర కేవలం ఒక్క డాలర్ పెరిగినా, మన ప్రభుత్వం ఏడాదికి అదనంగా రూ. 13,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం ముదిరి ధరలు పది, ఇరవై డాలర్లు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థపై పడే భారం ఊహకందని విధంగా ఉంటుంది. గతేడాది మనం చమురు దిగుమతుల కోసం 160 బిలియన్ డాలర్లు ఖర్చు చేశామంటే, ఇది మన దేశానికి ఎంతటి కీలకమైన అంశమో అర్థం చేసుకోవచ్చు.

భారత నిల్వలు..?

యుద్ధం వస్తే పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోతాయేమో అని కంగారు పడాల్సిన పని లేదు. కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పురి గతంలో చెప్పినట్లుగా, భారత్ దగ్గర 'వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు' ఉన్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే మన అవసరాలకు 74 రోజుల పాటు సరిపడా చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. అంటే సుమారు రెండున్నర నెలల వరకు మనకు ఇబ్బంది ఉండదు. కానీ, అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఆ భారం చివరకు సామాన్యుడి పెట్రోల్, డీజిల్ రేట్ల మీద పడక తప్పదు.

చమురు ధరలు పెరిగితే కేవలం పెట్రోల్ రేట్లే కాదు, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. పండ్లు, కూరగాయలు, పప్పులు.. ఇలా ప్రతిదీ ప్రియమవుతాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యుడికి ఇది 'గోరుచుట్టుపై రోకలిపోటు' లాంటిదే. యుద్ధం అనేది ఏ దేశానికైనా శాపం. అక్కడ బాంబులు పడితే, ఇక్కడ మన జేబులు ఖాళీ అవుతాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి, చమురు రవాణా యధావిధిగా సాగాలని కోరుకుందాం. లేకపోతే రాబోయే రోజుల్లో వాహనం బయటకు తీయాలంటేనే జంకాల్సిన పరిస్థితి రావచ్చు. చమురు ధరల మంట చల్లారాలని, శాంతి నెలకొనాలని ఆశిద్దాం.

Tags:    

Similar News