ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ.. అమెరికా వాడిన ఆయుధాలు ఇవే
ఇరాన్ పై ఇజ్రాయిల్ తో కలిసి అమెరికా ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ నేపథ్యంలో రెండు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది.;
ఇరాన్ పై ఇజ్రాయిల్ తో కలిసి అమెరికా ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ నేపథ్యంలో రెండు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. ఒకటి ఈ యుద్ధం ప్రపంచ దేశాల్ని రెండుగా చీల్చుతుందా అన్న ప్రశ్న. రెండోది అమెరికా వాడుతున్న ఆయుధాలపైన. అమెరికా ఆయుధాల ధాటికి ఇరాన్ వణుకుతోంది. అందుకే అమెరికా ఆయుధాలుపైన చర్చ జరుగుతోంది. వీటి కంటే ముందు ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ అంటే ఏంటన్న విషయం గురించి మాట్లాడుదాం.
ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ అంటే ఏమిటి?
న్యూక్లియర్ ప్రోగ్రామ్ విషయంలో తమ మాట వినని ఇరాన్ మిలటరీ, మిసైల్ వ్యవస్థను నిర్మూలించడానికి అమెరికా ఇజ్రాయిల్ తో కలిసి చేపట్టిన ఆపరేషన్ కు పెట్టిన పేరే ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో భాగంగా అమెరికా, ఇజ్రాయిల్ కలిసి దాదాపు 2000 టార్గెట్లను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ అయతొల్లా ఖమేనీతో పాటు కీలక ఉన్నతాధికారులు మరణించారు. వందలాది మంది సైనికులు, సామాన్య ప్రజలు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రతీకారంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న అమెరికా మిలటరీ బేస్ లపై ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో కూడా చాలా మంది మరణించగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు.
ప్రపంచం రెండుగా చీలుతుందా ?
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని చంపడం ఇరాన్ లో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ప్రతీకారేచ్చతో ఇరాన్ రగిలిపోతోంది. ఖమేనీ హత్యకు నిరసనగా పాకిస్థాన్ లో యూఎస్ ఎంబసీపై పాకిస్థాన్ పౌరులు దాడి చేశారు. ఈ ఘటనలో కూడా పదుల సంఖ్యలో చనిపోయారు. మరోవైపు ఇరాన్ పై అమెరికా దాడిని రష్యా, చైనా ఖండించాయి. చర్చల ద్వారా పరిష్కరించాలని కోరాయి. కానీ బ్రిటన్ మాత్రం అమెరికా వైపు నిలబడింది. ఇరాన్ సమీపంలో ఉన్న తమ స్థావరం వాడుకునేందుకు అమెరికాకు అనుమతించింది. అమెరికా బ్రిటన్ స్థావరం డియాగాగోర్సియా వాడుకునేందుకు తాత్కాలిక అవకాశం ఇచ్చింది. ఇరాన్ మిసైల్ దాడిని అడ్డుకునేందుకు ఈ స్థావరాన్ని అమెరికా వాడుకోనుంది. అమెరికా బి2 స్టెల్త్ బాంబర్లు ప్రయాణించడానికి అవసరమైన రన్ వే ఇక్కడ ఉంది. దీంతో అమెరికాకు ఇక్కడి నుంచి స్టెల్త్ బాంబర్లు ప్రయోగించడం సులువు. అమెరికాకు బ్రిటన్ తన స్థావరం తాత్కాలిక అవసరం కోసం అమెరికాకు ఇవ్వడం ద్వారా మద్దతుగా నిలిచింది. ఈ చర్య ఇరాన్ కు వ్యతిరేకంగా నిలవడమే. అమెరికాకు మద్దతుగా నిలబడటమే. ఇలా మిగిలిన దేశాలు కూడా ఇరాన్, అమెరికా వైపు చీలితే ప్రమాదం మరింత తీవ్రమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికాను నిలబెట్టిన ఆయుధాలేవి ?
ఇరాన్ పై దాడిలో అమెరికా వాడిన ఆయుధాలను బహిర్గతం చేసింది. బి2 స్టెల్త్ బాంబర్లు, లూకస్ డ్రోన్లు, పేట్రియాట్ క్షిపణిలు, థాడ్ బాలిస్టిక్ యాంటీ మిసైల్ సిస్టమ్, ఎఫ్ 18, ఎఫ్16, ఎఫ్22 ఫైటర్ జెట్లు, ఏ 10 ఎటాక్ జెట్స్, ఎఫ్ 35 స్టెల్త్ ఫైటర్స్, ఈఏ18జీ ఎలక్ట్రానిక్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, అవాక్స్ విమానం, ఎయిర్ బార్న్ కమ్యూనికేషన్ రిలే, పి 8 మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాప్ట్, ఆర్సీ 135 నిఘా విమానం, ఎంక్యూ 9 రీపర్స్, ఎం 142 హైమొబులిటీ రాకెట్ సిస్టమ్, అణుశక్తి విమాన వాహక నౌక, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, రీఫ్యూయలింగ్ విమనాలు, రీఫ్యూయలింగ్ షిప్ లను, సి17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానం, సీ 130 కార్గో విమానం వాడినట్టు అమెరికా సెంట్ కామ్ వెల్లడించింది.
అమెరికా వ్యూహమా ?
అమెరికా ఇరాన్ తో యుద్ధాన్ని వ్యాపారం కోసం వాడుతున్నట్టు అంచనా ఉంది. తాము వాడిన ఆయుధాల వివరాలు బహిర్గతం చేయడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకునే వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే, యుద్ధ భూమిలో తాము పైచేయి సాధించడానికి తాము వాడిన ఆయుధాలే కారణం అన్న అభిప్రాయం ప్రపంచ దేశాలకు కల్పించడం ద్వారా ఆయుధ తయారీ, వ్యాపారంలో పైచేయి సాధించాలని భావిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వ్యూహాత్మకంగా ఆయుధాల వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.