ఇరాన్ రివర్స్ ఇంజినీరింగ్.. అమెరికాను ఏం చేసిందంటే?
అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎవరికి చెక్ పెడతారో చెప్పలేం.. కానీ, ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం అమెరికాకు పగలు కూడా చుక్కలు కనిపిస్తున్నాయి.;
అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎవరికి చెక్ పెడతారో చెప్పలేం.. కానీ, ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం అమెరికాకు పగలు కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఒక దేశం దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉంటే, ఆ దేశం చాలా శక్తివంతమైనదని ప్రపంచం ఎరిగిన సత్యం. అమెరికా విషయంలో కూడా అదే నిజం. కానీ, ఇప్పుడు ఆ అమెరికా తయారు చేసిన ఆయుధాలే తిరిగి అమెరికాపైకి, లేదా వారి మిత్రదేశాలపైకి వస్తుంటే ఎలా ఉంటుంది..? సరిగ్గా ఇదే ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతోంది. ఇరాన్ తన తెలివితేటలతో అమెరికాకే 'రివర్స్' షాక్ ఇస్తోంది.
ఉక్రెయిన్ యుద్ధం.. ఇరాన్‌కు వరం..?
ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఇరాన్ వరంలా మార్చుకుంది. ఉక్రెయిన్ బలగాలకు మద్దతుగా అమెరికా తన అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సరఫరా చేస్తోంది. అయితే.., యుద్ధ భూమిలో రష్యా చేజిక్కించుకున్న కొన్ని అమెరికా ఆయుధాలను వారు ఇరాన్‌కు అప్పగిస్తున్నారనే వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. రష్యాకు, ఇరాన్‌కు ఉన్న స్నేహం గురించి మనందరికీ తెలిసిందే. రష్యాకు డ్రోన్లు ఇస్తున్నందుకు బదులుగా, ఇరాన్ ఈ అమెరికా టెక్నాలజీని తన వశం చేసుకుంటోంది.
రివర్స్ ఇంజినీరింగ్ ఇదేనా?
ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే ‘రివర్స్ ఇంజినీరింగ్’. అంటే ఒక వస్తువు ఎలా తయారైందో తెలుసుకోవడానికి దాన్ని విడదీసి, లోపల ఉన్న టెక్నాలజీని అర్థం చేసుకొని, మళ్లీ అలాంటిదే సొంతంగా తయారు చేయడం. ఇరాన్ ఈ విషయంలో ఆరితేరింది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ‘బీజీఎం-71 టీవోడబ్ల్యూ’ యాంటీ ట్యాంక్ మిస్సైల్‌ను ఇరాన్ చేజిక్కించుకుంది. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, దానిపై పరిశోధనలు చేసి దానిలాగే పనిచేసే 'తూఫాన్' అనే మిస్సైల్ తయారు చేసేసింది. ఇప్పుడు ఈ తూఫాన్ మిస్సైళ్లు అమెరికా ట్యాంకులను ధ్వంసం చేసే స్థాయికి చేరాయి.
అంతేకాదు, అమెరికా గూఢచారి డ్రోన్ అయిన ‘ఆర్‌క్యూ-170 సెంటినల్’ డిజైన్‌ను ఉపయోగించి ఇరాన్ సొంతంగా ‘షాహెద్’ డ్రోన్లను రూపొందించింది. ఈ షాహెద్ డ్రోన్లు ఇప్పుడు యుద్ధ రంగంలో ఎంతటి అలజడి సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థలకే సవాల్ విసురుతున్నాయి.
వెస్ట్రన్ టెక్నాలజీ.. ఇరాన్ చేతుల్లో!
అమెరికా గర్వంగా చెప్పుకునే ‘జావలిన్’, ‘స్టింగర్’ వంటి ఆధునిక క్షిపణుల టెక్నాలజీ కూడా ఇప్పుడు ఇరాన్ సొంతం చేసుకుంటోంది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు పంపిన ఈ ఆయుధాలు రష్యా చేతికి చిక్కితే, అవి నేరుగా ఇరాన్ ల్యాబ్‌కు చేరుతున్నాయి. అక్కడ శాస్త్రవేత్తలు వాటిని చదివేసి, వాటిలోని లోపాలను గుర్తించి, వాటికంటే మెరుగైన లేదంటగే అలాంటివే చవకగా తయారు చేస్తున్నారు. తన టెక్నాలజీని దొంగిలించి తనకే పోటీగా నిలబడుతున్న ఇరాన్‌ను చూసి అమెరికా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది.
అగ్రరాజ్యానికే సవాల్..
నిజానికి ఇది అమెరికాకు పెద్ద తలనొప్పి అనే చెప్పాలి. మనం ఒక ఆయుధాన్ని తయారు చేసి శత్రువుపైకి పంపితే, వాడు దాన్ని పట్టుకొని, తిరిగి అలాంటిదే పది రెట్లు ఎక్కువగా తయారు చేసి మనపైకే వదిలితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అమెరికా పరిస్థితి అదే. ఇరాన్ ఇప్పుడు కేవలం యుద్ధం చేయడం లేదు.. అమెరికా అహంకారాన్ని దెబ్బతీస్తోంది. ఒక చిన్న దేశం అనుకున్న ఇరాన్, ప్రపంచ అగ్రరాజ్యం టెక్నాలజీనే వాడుకుంటూ వారికే సవాల్ విసరడం అంటే మామూలు విషయం కాదు.
రాబోయే రోజుల్లో యుద్ధాలు కేవలం తుపాకులతోనో, బాంబులతోనో కాదు.. ఇలాంటి టెక్నాలజీ తెలివితేటలతోనే జరగబోతాయి. ఇరాన్ అనుసరిస్తున్న ఈ రివర్స్ ఇంజినీరింగ్ పద్ధతి వల్ల అమెరికా తన ఆయుధాల రహస్యాలను కాపాడుకోవడం కష్టం అవుతోంది. ‘శత్రువు ఆయుధంతోనే శత్రువును కొట్టడం’ అనే సూత్రాన్ని ఇరాన్ అక్షరాలా అమలు చేస్తోంది. ఈ ‘ఆయుధాల పోరు’ భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!