ఆడంబరాల ప్రదర్శనపై చైనీయుల ఆగ్రహం.. పెరుగుతున్న అసహనం

Update: 2021-06-12 01:30 GMT
చైనాలో అతి సంపన్నులపై అసహనం రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు తమ ఆడంబరాలను ప్రదర్శించుకోవడానికి ఖరీదైన వస్తువులు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తినే తిండి, ఆహారం, వాహనాలు, హ్యాండ్ బ్యాగులతో తాము సంపన్నులమని చెప్పకనే చెబుతున్నారని చైనీయులు మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో ధనవంతులు అత్యంత ధనవంతులుగా, పేదవాళ్లు మరింత పేదరికంలోకి దిగజారుతున్నారని వాపోయారు.

హార్పర్స్ బజార్ చైనా మాజీ ఎడిటర్ సూ మాంగ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాను ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని ఓ రియాలిటీ షోలో వెల్లడించారు. అంతేకాకుండా తక్కువ ప్రమాణాలతో భోజనం చేయలేనని వ్యాఖ్యానించారు. 15 మంది సెలబ్రిటీలు 21 రోజుల పాటు కలిసి ఉండే షోలో ఆమె పాల్గొన్నారు.  ఆ షోలో గడిపేందుకు తనకు 650 యువాన్ లు సరిపోవని అన్నారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వివాదం రేపుతున్నాయి.

సెలబ్రిటీలు ఎప్పుడూ ఉన్నతవర్గాలకు చెందిన వారేనని విబూలో చర్చనీయాంశంగా మారింది. తమకు 30 యువాన్ లే రోజువారీ భోజనానికి అలెవెన్సుగా ఇస్తున్నారని వాపోయారు. సంపన్నులు తమ హోదాను, విలాసవంతమైన జీవితాన్ని ఇతరులు అసూయ పడేలా చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కష్టపడినా సరిపడా డబ్బులు సంపాదించలేకపోతున్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో కొందరికి అవసరానికి మించిన డబ్బు ఉంటే మరికొందరికి చాలా తక్కువ డబ్బు ఉందని సామాజిక మాధ్యమాల వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.

డ్రాగన్ దేశంలో వార్షిక సగటు ఆదాయం 32,189 యువాన్ లు కాగా (5,030 డాలర్లు), నెలకు సుమారు 2,682 యువాన్ లు గా నమోదైంది. అత్యధిక సంఖ్యలో ధనవంతులు నివసిస్తున్న ప్రాంతాల్లో బీజింగ్ తొలి స్థానంలో ఉంది. మిగతా దేశాల్లో ఆర్థిక అసమానతలు ఉన్నప్పటికీ చైనాలో తీవ్రంగా ఉన్నాయని ఆదేశ ప్రజలు అంటున్నారు. ప్రపంచీకరణ అనంతరం ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు నిరుపేదరికంలోకి కూరుకుపోతున్నారని వాపోయారు. ఆడంబరాలను ప్రదర్శించే సంపన్నులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 
Tags:    

Similar News