టార్గెట్ అమెరికా...చైనాలో మ‌ద‌ర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌

Update: 2019-01-05 05:03 GMT
అగ్ర‌రాజ్యం అమెరికా క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యే ప‌రిణామం ఇది. అమెరికాకు దీటుగా చైనా కూడా ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరిట అమెరికా తయారుచేసిన భారీ బాంబుకు పోటీగా చైనా మరో బాంబును అభివృద్ధి చేసింది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ కు చైనీస్ వర్షన్‌ గా దీన్ని అభివర్ణిస్తున్నారు! చైనా రక్షణ రంగ దిగ్గజం చైనా నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్ లిమిటెడ్ (నోరింకో) ఈ అణ్వస్త్ర రహిత బాంబ్‌ ను అభివృద్ధి చేసింది. హెచ్-6కే బాంబర్ ద్వారా దీన్ని ప్రయోగించగా భారీ పేలుడు సంభవించింది. ఇందు కు సంబంధించిన వీడియోను నోరింకో తన వెబ్‌ సైట్‌ లో పొందుపరిచింది. చైనా తయారు చేసిన బాంబు అమెరికా బాంబు కంటే చిన్నదని - తక్కువ బరువు ఉంటుందని చైనాకు చెందిన మిలిటరీ విశ్లేషకులు వీ డాంగ్జూ తెలిపారు. అమెరికా బాంబు చాలా బరువు ఉండడంతో దాన్ని మోసుకెళ్లేందుకు భారీ యుద్ధ విమానం అవసరమవుతుందని వివరించారు. అదే చైనా బాంబ్‌ ను బాంబర్ (చిన్న యుద్ధ విమానం) ద్వారా ప్రయోగించవచ్చని చెప్పారు.

దాదాపుగా 9,500 కిలోల బరువు... అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన బాంబ్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. 1.61 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం మొత్తానికి భూకంపం వచ్చినప్పుడు కలిగే తీవ్రతను తెప్పించగలదు. నేలకు తగలకముందే తీవ్రమైన పేలుడును ఈ బాంబు సృష్టిస్తుంది. 300 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న దేన్నయినా ఇది నాశనం చేయగలదు. ఆ ప్రాంతంలో మనుషులు ఉంటే ఇక అంతే సంగతులు. వెదుక్కోవడానికి ఎముకలు, బూడిద తప్ప ఏమీ మిగలవు. అంతటి శక్తివంతమైన బాంబ్ అది. 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా ఈ జీబీయూ-43ని తయారు చేసింది. అయితే దాన్ని ఇప్పటి వరకు వాడలేదు. తాజాగా ఆప్ఘనిస్తాన్‌ లోని ఉగ్రస్థావరంపై ఈ బాంబుతో అమెరికా దాడి చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఈ బాంబుపై పడింది. దీంతో అమెరికా తయారు చేసిన ఈ జీబీయూ-43నే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్న నాన్ న్యూక్లియర్ బాంబులలో అతి పెద్దదిగా భావిస్తున్నారు. దీన్ని ప్రస్తుతం మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలుస్తున్నారు. భూగర్భంలో ఉన్న నిర్మాణాలను - గుహలను - సొరంగాలను పేల్చడం కోసం దీన్ని తయారు చేశారు. జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థ ఆధారంగా ఎంత దూరం నుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చు.

అమెరికా వద్దే జీబీయూ-57ఎ/బి మాస్సివ్ ఆర్డ్‌నెన్స్ పెనట్రేటర్ (MOP) పేరిట మరో నాన్ న్యూక్లియర్ బాంబ్ ఉంది. దీని బరువు సుమారుగా 13,607 కిలోలు. కానీ ఇది జీబీయూ-43 అంతటి శక్తివంతమైన బాంబు మాత్రం కాదు. దీన్ని భూగర్భ స్థావరాల్లో దాక్కున్న శత్రువులను మట్టుబెట్టేందుకు అమెరికా తయారు చేసింది.


Full View

Tags:    

Similar News