బ్యాడ్ న్యూస్.. ఈసారికి చేపమందు లేదు

Update: 2020-05-11 05:00 GMT
యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా చేసి.. అందరిని ఇళ్లల్లో కూర్చోబెట్టిన రోగం.. ప్రతి ఏటా భారీగా సాగే చేపమందు ప్రసాదానికి బంద్ పడేలా చేసింది. ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున ఉబ్బస రోగ నివారణకు బత్తిని హరినాథ్ గౌడ్ సోదరులు చేపమందు ప్రసాదాన్ని వేయటం తెలిసిందే. ఈ ప్రసాదంపై పలు విమర్శలు ఉన్నా.. దీని కోసం దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తుతుంటారు.

గతంలో ఈ ప్రసాదం కోసం లక్షల్లో హైదరాబాద్ కు వచ్చేశారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసేది కూడా. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. సేవా భావంతో బత్తిని సోదరులు అందించే ఈ చేపమందు ప్రసాదంతో ఎంతోమంది కోలుకున్నట్లుగా చెబుతారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఏడాది చేప మందు ప్రసాదాన్ని అందించలేకపోతున్నట్లుగా బత్తిని సోదరులు వెల్లడించారు. ఎక్కడికక్కడ వ్యవస్థలన్ని నిలిచిపోవటం.. రవాణా సదుపాయం లేకపోవటంతో పాటు.. ఇళ్లను విడిచి బయటకు రాని పరిస్థితుల్లో ప్రతి ఏటా అందించే చేప ప్రసాదం ఈ ఏడాదికి వాయిదా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. చేపమందు కోసం ఆశగా ఎదురు చూసే వారికి ఇది కచ్ఛితంగా బ్యాడ్ న్యూస్ గా చెప్పక తప్పదు.
Tags:    

Similar News