క్రెడిట్ స్కోర్ ను దెబ్బేయనున్న మారిటోరియం

Update: 2020-10-04 06:30 GMT
మాయదారి మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచమంతా ఆగమాగం కావటం తెలిసిందే. ఓవైపు కరోనా.. మరోవైపు లాక్ డౌన్ పుణ్యమా అని ఉద్యోగాలు పెద్ద ఎత్తున పోవటం.. జీతాల్లో కోత పడిన నేపథ్యంలో బ్యాంకుల్లో తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లించే విషయంలో రిజర్వు బ్యాంకు మారిటోరియం సదుపాయాన్నికల్పించింది. ఈ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్న వారికి బ్యాంకులు వేసే చక్రవడ్డీ ఉదంతం తెర మీదకు వచ్చింది.

దీంతో.. మారిటోరియం వల్ల ప్రయోజనం కంటే కూడా భారమే అధికమన్న వాదన బలంగా వినిపించింది. దీని వల్ల ఎలాంటి ఊరట లభించదన్న మాటనుపలువురు స్పష్టం చేశారు. బ్యాంకర్లు సైతం.. వీలైనంతవరకు మారిటోరియంను వాడుకోకుంటేనే మంచిదన్న మాట వారి నోటి నుంచి రావటం కనిపించింది. మారిటోరియం వేళ.. బకాయిలు చెల్లించని వ్యక్తులు కానీ కంపెనీలు కానీ డిఫాల్టర్లుగా ప్రకటించొద్దని ఆర్ బీఐ బ్యాంకులకు సూచన చేసింది. అయితే.. ఈ విషయం మీద మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.

మారిటోరియం ఎంపిక చేసుకున్న వెంటనే.. ఆ విషయాల్ని సంబంధిత బ్యాంకులు క్రెడిట్ స్కోర్ అందించే సంస్థలకు తెలియజేయటం ఖాయం. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేసుకోవటం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే.. ఏదైనా తేడా జరిగితే వెంటనే ఆయా సంస్థలకు తమ స్కోర్ విషయంలో జరుగుతున్నతప్పుల గురించి పిర్యాదు చేసే వీలుందని చెబుతున్నారు. మారిటోరియం సదుపాయాన్ని వినియోగించుకున్న వారు తమ క్రెడిట్ స్కోర్ ఏమైనా ప్రభావితమైందన్న విషయాన్ని గుర్తించటం చాలా అవసరమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News