భయపెట్టేసిన ఫేక్ జీవోను తయారు చేసింది ఛార్టెడ్ అకౌంటెంటా?

Update: 2021-04-05 17:30 GMT
గత వారంలో ఒక జీవో చాలానే హడావుడి చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినట్లుగా ఉన్న ఈ ఫేక్ జీవోలో లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా వాట్సాప్ లో వైరల్ అయ్యింది. దీంతో.. పలువురు కంగారు పడిపోతే.. మరికొందరు ఆందోళన చెందారు. వ్యాపార రంగానికి చెందిన వారి సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు.

ఇప్పుడిప్పుడే వ్యాపారాలు కుదురుకుంటున్న వేళ.. రాత్రి సమయంలో లాక్ డౌన్ కానీ ప్రకటిస్తే.. మునిగిపోతామన్న భయాందోళనలు ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి జీవో జారీ చేయకున్నా.. ఈ ఫేక్ జీవో అటు సామాన్యుల్నే కాదు.. మీడియాలోని వారికి హడావుడి పెట్టించింది. కీలక అంశానికి సంబంధించి ప్రభుత్వ జీవో విడుదలైతే.. మీకు ఎందుకు తెలీటం లేదన్న ఆగ్రహావేశాల్ని పలువురు మీడియా సిబ్బంది ఎదుర్కొన్నారు. ఈ ఫేక్ జీవో పుణ్యమా అని.. అంతా గడబిడగా తయారైంది.

లక్షలాది మందిని టెన్షన్ పుట్టించిన ఈ ఫేక్ జీవో లెక్క తేల్చేందుకు హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు రంగంలోకి దిగారు. వైరల్ చేసిన పోస్టును తయారు చేసిన వ్యక్తి గుర్తించే పనిలో పడ్డారు. సాంకేతిక సాయంతో హైదరాబాద్ కు చెందిన శ్రీపతి రంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఇదంతా చేసినట్లు గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి వేళలో లాక్ డౌన్ విధిస్తారంటూ నకిలీ జీవోను తయారు చేసి.. తెలిసిన వారి గ్రూపుల్లో వేశారు.

దాన్ని ఎవరికి వారు.. షేర్ చేయటంతో తక్కువ సమయంలో అది కాస్తా వైరల్ అయ్యింది. ప్రజల్ని తప్పుదోవ పట్టించి.. భయాందోళనకు గురయ్యేలా చేసిన ఈ వ్యక్తి ఛార్టెడ్ అకౌంట్ టెంట్ గా పని చేస్తున్నారన్న విషయం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. అత్యుత్తమ స్థానంలో ఉన్న వ్యక్తి.. ఫేక్ జీవోల్ని వైరల్ చేయటమా? అన్న ఆశ్చర్యానికి గురి కాక మానదు. హైదరాబాద్ లో ఉంటున్న ఇతని సొంతూరు నెల్లూరు పట్టణంగా గుర్తించారు.

లాక్ డౌన్ పై గతంలో ఇచ్చిన జీవోను డౌన్ లోడ్ చేసి.. తేదీలు మార్చి.. పాత జీవోను కొత్తగా తయారు చేసినట్లుగా చేసి స్నేహితుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని నమ్మొద్దని.. ఇలాంటి తప్పుడు మెసేజ్ లు ఫార్వర్డ్ చేస్తే.. గ్రూపు అడ్మిన్ల మీద కూడా కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. మొత్తంగా చెప్పొచ్చొదేమంటే.. మనకు వచ్చిన అన్ని పోస్టుల్ని వెంటనే ఫార్వర్డ్ చేయకుండా.. అసలా? నకిలీనా? అన్నది చెక్ చేసుకున్న తర్వాతే షేర్ చేయటం చాలా మంచిది. లేదంటే.. లేనిపోని కష్టాల్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.
Tags:    

Similar News