ఈసారి ఎన్నికలకు బాబుకు అలాంటోళ్లు కావాలట!

Update: 2022-01-06 08:30 GMT
అధికారంలో ఉన్నప్పుడు అధికారులతో.. విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతలతో ఉండే సిత్రమైన అధినేత నారా చంద్రబాబు నాయుడు. తొమ్మిదిన్నరేళ్లు నాన్ స్టాప్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయనకు.. పదేళ్ల పాటు సుదీర్ఘ విపక్ష నేతగా ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో ఆయన చాలా ఎదురుదెబ్బలు తిన్నారు. దీంతో..ఆయనలో మార్పు వచ్చేసిందని.. మారిన చంద్రబాబు నాయుడ్ని చూడొచ్చని చాలామంది అనుకున్నారు. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు.. గతంలో చేసిన తప్పులు చేయరని చాలామంది భావించారు.

కానీ.. అలాందేమీ జరగలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు అధికారం దూరమైంది. అయితే.. ఈసారి మాత్రం ఆయన తన రాజకీయ జీవితంలోనే ఎప్పుడూ ఎదురుకాని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈసారి ఎదురైన ఎదురు దెబ్బలతో ఆయన మొత్తంగా మారిపోయారని.. ఈసారి ఆయన చేతికి అధికారం వస్తే.. కొత్త తరహా చంద్రబాబును చూస్తారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన పార్టీ విస్త్రత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రోటీన్ కు కాస్త భిన్నంగా ఉన్నాయనే చెప్పాలి.

వచ్చే ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని.. వైసీపీ రౌడీయిజాన్ని.. దౌర్జన్యాన్ని.. ఆరాచకాల్ని ఎదుర్కొని నిలవాలంటే ఢీ అంటే ఢీ అనే నాయకత్వమే కావాలన్నారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని.. అక్కడి ప్రజలు తననెంతో అభిమానిస్తారన్నారు. అలాంటి చోట వైసీపీ నేతలు వారి ఆరాచకాలతో పార్టీని ఇబ్బంది ఇబ్బంది పెడుతుంటే.. మిగితా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు.

పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని కచ్ఛితంగా చేసి తీరాలని.. అంకిత భావంతో పని చేయాలన్న చంద్రబాబు.. ‘ఇష్టం లేని వారుంటే దండం పెట్టి ఆ బాధ్యత నుంచి వైదొలగాలి. పార్టీ ఏమీ బాధ పడదు. కొత్తవారికి అవకావం వస్తుంది. పని చేయకుండా పదవులు రావాలని.. పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటే ఉపయోగం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇంత సీనియార్టీ ఉన్న చంద్రబాబుకు పార్టీలో పని చేసేవాళ్లు ఎవరో? పని చేయకుండా పదవులు ఆశించేవారు ఎవరో తెలీదా? ఎవరికి వాళ్లు నిర్ణయం తీసుకునే కన్నా.. పార్టీకి బరువైన వాళ్లను గుర్తించి పక్కన పెట్టేసి.. కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ఈ మాటలు ఎన్ని చెబితే మాత్రం ఉపయోగం ఏమిటి? అన్నది ప్రశ్న.

పార్టీ ఇన్ ఛార్జులు.. నియోజకవర్గ ఇన్ ఛార్జులు వారానికి మూడు రోజులు ప్రజల్లో ఉండాలన్న చంద్రబాబు.. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్ని చేపడితే ప్రభుత్వం అడ్డుకుంటుందని.. అదే గ్రామాల్లో ఎంత తిరిగినా మనల్ని అడ్డుకోలేరన్నారు. ఇలాంటి వ్యూహాలు అందరి ముందు చెప్పే కన్నా.. పార్టీ పాలసీగా మార్చేస్తే పోలా? గేమ్ ప్లాన్ ను ఓపెన్ గా చెప్పే కన్నా.. దాన్ని వ్యూహాత్మకంగా అమలు మీద ఫోకస్ చేయాలన్న విషయాన్ని చంద్రబాబు మిస్ కావటం ఏమిటి చెప్మా?




Tags:    

Similar News