బాబుకు లోకేష్ కి అసూయ...ఎందుకలా ?

తాను ఏయూలో ఎందుకు చదవలేదన్న బాధ కలుగుతోందని నారా లోకేష్ చెప్పడం విశేషం.;

Update: 2026-04-27 14:21 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఇద్దరూ చరితార్ధులైన సందర్భం ఇది. వందేళ్ల ఏయూ ఉత్సవాలలో ఈ ఇద్దరూ పాల్గొన్నారు. ఏయూకి వందేళ్ళు నిండిన సందర్భంలో బాబు ముఖ్యమంత్రిగా ఉండడం ఒక ఎత్తు అయితే లోకేష్ విద్యా మంత్రిగా ఉండడం మరో ఎత్తు. ఇలా తండ్రీ కొడుకులు ఒక హిస్టారికల్ ఈవెంట్ లో ముఖ్య అతిధులుగా పాల్గొనడమే కాదు ఆ చరిత్రలో తాము కూడా భాగం అయ్యారు. ఏయూ వందేళ్ళ పండుగలో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా మంత్రి లోకేష్ స్పూర్తివంతమైన ప్రసంగాలు చేశారు. ఈ ఇద్దరి స్పీచ్ కి ఆహుతుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఇద్దరూ ఏయూని ఎంతగానో ప్రశంసించారు. అది ఎంతలా అసూయ పుట్టించేలా.

ఏయూని చూస్తే అలా :

తనకు ఏయూని చూస్తే అసూయ కలుగుతోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బ్యూటీఫుల్ క్యాంపస్ అంతే కాదు బ్యూటీఫుల్ సిటీ, విద్యార్ధులకు ఏమైనా ఒత్తిడి ఉంటే బీచ్ దగ్గర వాక్ చేస్తే చాలు కొత్త శక్తి వస్తుంది ఇలా నేచర్ కి అతి సమీపంలో ఉన్న ఏయూ వర్శిటీలో చదువుకుంటున్న విద్యార్థులు అంతా చాలా అదృష్టవంతులు అని బాబు అన్నారు. అయితే తాను కూడా వారితో పాటు ఒక విద్యార్ధిగా మారి మళ్ళీ ఇక్కడ చదువుకోవాలనిపిస్తోంది అని కూడా బాబు అన్నారు. ఏయూ అన్నది ఒక బ్రాండ్ అన్నారు. ఏయూ దేశానికి దిక్సూచిగా మారుతోందని కూడా చెప్పారు.

ఎందుకు చదవలేదన్న బాధ :

తాను ఏయూలో ఎందుకు చదవలేదన్న బాధ కలుగుతోందని నారా లోకేష్ చెప్పడం విశేషం. తాను స్టాన్ ఫోర్డ్ వర్శిటీలో చదివాను అని ఆయన చెబుతూ అందమైన ఏయూని చూసినపుడు తాను అక్కడే చదవాలనిపించింది అన్నారు. దాంతో ఒక రకమైన అసూయ కూడా విద్యార్ధులను చూస్తే కలుగుతోందని అన్నారు. ఇలా తండ్రీ కొడుకులు ఇద్దరూ అసూయ అంటూ ఒకే రకమైన భావన వ్యక్తం చేయడం ఒక విశేషం అయితే ఏయూ గ్రేట్ నెస్ ని కూడా అందులో వారు చెప్పడం మరో విశేషం.

చిన్న కోరిక అంటూ :

ఇదే సందర్భంలో చిన్న కోరిక అంటూ నారా లోకేష్ విద్యా మంత్రి హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు. ఏయూలో పరిశోధనల కోసం రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని కోరారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో లోకేష్ వినతిని గుర్తు చేసుకున్నారు. మీ విద్యా మంత్రి కోరిన దానికి రెట్టింపు ఇస్తున్నాను అంటూ 500 కోట్ల రూపాయల నిధులను ఏయూకి కేటాయిస్తూ కీలక ప్రకటన చేశారు. అంతే కాదు ఏయూ పూర్వ విద్యార్ధులు భారీ పారిశ్రామిక దిగ్గజాలుగా ఎదిగిన గ్రంధి మల్లికార్జునరావు లాంటి వారు పూర్వ విద్యార్ధులు అంతా ఒక్కటిగా నిలిచి మరో అయిదు వందల కోట్ల రూపాయలు ఏయూకి కార్పస్ ఫండ్ గా సేకరించి పెట్టాలని బాబు కోరడం దానికి వారు అంగీకరించడం విశేషం.

Tags:    

Similar News