మంత్రి కొడాలి నానికి పోటీగా సీనియర్ నేతని రంగంలోకి దించిన చంద్రబాబు !

Update: 2020-02-20 12:30 GMT
ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ ముందుకుసాగుతోంది. జగన్ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిన మూడు రాజధానుల రగడ పై ఇంకా రాష్ట్రంలో రచ్చ జరుగుతూనే ఉంది. అమరావతి ప్రాంత ప్రజలు ..అమరావతిలోని రాజధాని కావాలంటూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని పటిష్టం చేసే పనిలో నిమగ్నమైనట్టు కనిపిస్తుంది. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా , తొమ్మిదినెలల్లో ప్రభుత్వం చేసిన మోసాలని వివరిస్తా అంటూ బాబు బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీని మరింత బలంగా తయారుచేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలని విశ్లేషిస్తూ ..ఆ తప్పులు మళ్లీ జరగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో పార్టీ పరిస్థితి పై ఆరాతీస్తున్నారు. ఇక ఎన్నికలకి ముందు , ఎన్నికల తరువాత కొందరు నేతలు పక్క పార్టీలలోకి వెళ్లిపోవడంతో అక్కడ ఇంచార్జిలని నియమిస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా కొన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌ లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మళ్లీ రావి వెంకటేశ్వరరావు కు బాధ్యతలు అప్పగించారు. 2014లో ఆయన గుడివాడ నుంచి పోటీచేసి మంత్రి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత గుడివాడ టికెట్ .. 2019 లో దేవినేని అవినాష్‌ కు కేటాయించగా.. ఆయన గెలుపు కోసం రావి పనిచేశారు. కానీ, ఎన్నికల తరువాత అవినాష్ వైసీపీలో చేరడంతో.. గుడివాడలో టీడీపీ కి ఇంఛార్జ్ లేడు. దీనితో ఇప్పుడు మళ్లీ వెంకటేశ్వరరావు కు ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజక వర్గానికి బడేటి రాధాకృష్ణ కు ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామయ్య చనిపోయారు. దీంతో ఆ బాధ్యతల్ని బుజ్జి సోదరుడైన రాధాకృష్ణకు అప్పగించారు.అలాగే , గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి కొమ్మారెడ్డి చలమా రెడ్డిని ఇంఛార్జ్‌ గా నియమించారు. 2019 ఎన్నికల్లో చలమారెడ్డికి కాకుండా అంజిరెడ్డికి టికెట్ కేటాయించగా.. ఆయనకు ప్రభుత్వ విప్ పిన్నెల్లి చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో చలమారెడ్డికి మళ్లీ బాధ్యతలు అప్పగించారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గానికి వేగేశ్న నరేంద్ర వర్మకు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ 2014,2019లో పోటీచేసిన అన్నం సతీష్‌ ప్రభాకర్ బీజేపీ లో చేరిపోయారు. ఆయన పార్టీ మారిన తర్వాత అక్కడ ఇంఛార్జ్ బాధ్యతలు ఎవరికీ ఇవ్వలేదు.. నియోజకవర్గంలో యాక్టివ్‌ గా ఉన్న వర్మకు బాధ్యతలు అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కోవెలమూడి రవీంద్ర ను ఇప్పటికే నియమించిన సంగతి తెలిసిందే. అయితే, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ..గత కొద్ది రోజులుగా టీడీపీ కి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయన వైసీపీలో చేరక పోయినప్పటికీ .. టీడీపీ తరపున ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు. అసెంబ్లీ లో కూడా స్వసంత్ర్య అభ్యర్థిగా తనని గుర్తించాలని కోరిన విషయం తెలిసిందే. అక్కడ టీడీపీ ఇంఛార్జ్ ఎవరు అనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు.
Tags:    

Similar News