ముగిసిన స‌భా స‌మ‌రం: రేవంత్‌దే పై'చేయి'!

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు.. సోమ‌వారంతో ముగిశాయి. మార్చి 20వ తేదీన ప్రారంభ‌మైన స‌భ‌లు.. మొత్తంగా 11 రోజులు కొన‌సాగాగి.. మార్చి 30(సోమ‌వారం రాత్రి) ముగిశాయి.;

Update: 2026-03-31 09:00 GMT

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు.. సోమ‌వారంతో ముగిశాయి. మార్చి 20వ తేదీన ప్రారంభ‌మైన స‌భ‌లు.. మొత్తంగా 11 రోజులు కొన‌సాగాగి.. మార్చి 30(సోమ‌వారం రాత్రి) ముగిశాయి. మ‌ధ్య‌లో ఒక రోజు సెల‌వు ప్ర‌క‌టించారు. తొలిరోజు గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్రతాప్ సింగ్ ప్ర‌సంగంతో ప్రారంభ‌మైన స‌భ‌లలో ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క 2026-27 వార్షిక‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. అదేవిధంగా ఈ స‌భ‌ల్లోనే 11 బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్ట‌గా.. వీటిలో ద్ర‌వ్య వినిమ‌య బిల్లు స‌హా 10 బిల్లుల‌ను స‌భ ఆమోదించింది. ఒక బిల్లును మాత్రం సెల‌క్ట్ క‌మిటీకి పంపించింది.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పంచాయతీ రాజ్ సంస్థలు, పురపాలక సంస్థలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థల ఖాతాలపై ఏకీకృత ఆడిట్, సమీక్ష నివేదికతో సహా పలు నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. సామాజిక, ఆర్థిక రంగాలు, స్థానిక సంస్థలు, నిర్మాణ కార్మికుల సంక్షేమం, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ కాలాలకు సంబంధించిన ఆర్థిక కేటాయింపుల ఖాతాలకు సంబంధించి భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నివేదికలను కూడా స‌భ‌కు స‌మ‌ర్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విలువ ఆధారిత పన్ను(సవరణ) బిల్లు, 2026, తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల(నివారణ) బిల్లు, 2026, తెలంగాణ న్యాయవాదుల రక్షణ బిల్లు, 2026తో సహా పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. అలానే కీల‌క‌మైన గిగ్ వర్కర్ల సామాజిక భద్రతా బిల్లును మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రవేశపెట్టారు. ఇక‌, తెలంగాణ కేటాయింపుల బిల్లు, 2026 ను ప్రవేశపెట్టారు. వీటితో పాటు త‌ల్లిదండ్రుల సంర‌క్ష‌ణ బిల్లును కూడా ప్ర‌వేశ పెట్టి ఏక‌గ్రీవంగా ఆమోదించారు.

ప్రాజెక్టుల నుంచి రాజ‌కీయం వ‌ర‌కు..

ఇక‌, ఈ స‌మావేశాల్లో ప్రాజెక్టుల నుంచి రాజ‌కీయం వ‌ర‌కు అనేక అంశాల‌పై అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఒక ర‌క‌మైన యుద్ధ‌మే జ‌రిగింద‌ని చెప్పాలి. మాజీ సీఎం కేసీఆర్ స‌భ‌కు రాక‌పోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే కార్న‌ర్ చేశారు. ఇక‌, కాళేశ్వ‌రం విష‌యంపై ఇటు బీజేపీని, అటు కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. మ‌రో ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రిపై చేసిన వ్యాఖ్య‌లు, ప్ర‌వ‌ర్తించిన తీరు తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో కౌశిక్ రెడ్డి విష‌యాన్ని స‌భా హ‌క్కుల సంఘానికి సిఫార‌సు చేయాల‌ని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి కోర‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, హ‌రీష్‌రావు కుటుంబం అవినీతికి పాల్ప‌డింద‌ని కాంగ్రెస్‌, .. మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కుటుంబానికి చెందిన రాఘ‌వ క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీ అవినీతికి పాల్ప‌డింద‌ని బీఆర్ ఎస్ ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌ల‌తో స‌భ దద్ద‌రిల్లింది. దీంతో చివ‌రి రెండు రోజులు బీఆర్ ఎస్ స‌భ్యుల‌ను స‌భ నుంచి స‌స్సెండ్ చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి బ‌డ్జెట్ స‌మావేశాల్లో హైలెట్‌గా నిలిచార‌నే చెప్పాలి.

Tags:    

Similar News