మార్చిలోనే ముహూర్తం! పోలవరంపై బిగ్ అప్డేట్

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమాచారం వెల్లడించారు. ప్రస్తుతం 89 శాతం మేర పనులు జరిగాయని, గోదావరి పుష్కరాలు కంటే ముందుగానే నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.

Update: 2026-07-13 11:25 GMT

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమాచారం వెల్లడించారు. ప్రస్తుతం 89 శాతం మేర పనులు జరిగాయని, గోదావరి పుష్కరాలు కంటే ముందుగానే నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రాజెక్టు పూర్తవుతుందని, ఆ తర్వాత జాతికి అంకితం చేస్తామని సీఎం పేర్కొన్నారు. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజి వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా సర్ ఆర్దర్ కాటన్ బ్యారేజీ పునరుద్ధరణ, పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమైన సమాచారాన్ని సీఎం పంచుకున్నారు.

కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం పనులు 89 శాతం పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు వివరించారు. రెండేళ్లలోనే పనులు పరుగులు పెట్టించామని వ్యాఖ్యానించారు. 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 2 శాతం పనులు మాత్రమే చేసి చేతులెత్తేసిందని విమర్శించారు. 2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తి చేసేవారమని సీఎం వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసి వచ్చే మార్చిలో ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ఇక ధవళేశ్వరం పర్యటన తర్వాత సీఎం పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ముందుగా హెలికాఫ్టర్ నుంచి గోదావరి ప్రవాహం, ఎగువ దిగువ కాపర్ డ్యాం పనులను చూశారు. అనంతరం ప్రాజెక్టులోని ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణాలను విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసేలా సిబ్బంది పనిచేయాలని పిలుపునిచ్చారు.

కాగా, కూటమి ప్రధాన ఎన్నికల హామీ అయిన పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాలు కంటే ముందుగానే పూర్తి చేస్తామనే పట్టుదల ప్రభుత్వంలో కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. గత రెండేళ్లలో సుమారు 24 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్న ప్రభుత్వం పోలవరం పూర్తికి అధిక ప్రాధాన్యమిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం స్పిల్ వేతోపాటు ఈసీఎఫ్ఆర్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఇంకా జల విద్యుత్ కేంద్రం నిర్మాణాలు మాత్రమే పెండింగులో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పూర్తయిన పనులతో కాలువలకు నీరు విడుదల చేసే అవకాశాలు ఉన్నా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో సిద్ధం చేశాకే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. దీంతో వచ్చే ఖరీఫ్ నాటికి పోలవరం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News