‘‘మాయాంధ్ర జ్యోతి, సొమ్మున్న పత్రిక’’ టీడీపీ మీడియా Vs ఏబీవీ.. నెక్ట్స్ లెవల్ కు ట్వీట్ వార్
అధికార తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగంతోపాటు టీడీపీ సానుకూల మీడియాతో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కు వైరం పెరుగుతోందా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది.
అధికార తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగంతోపాటు టీడీపీ సానుకూల మీడియాతో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కు వైరం పెరుగుతోందా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. గత శుక్రవారం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఏబీవీ వేదిక పంచుకోవడంపై మొదలైన రచ్చ రోజురోజుకు తీవ్రమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో తనను తప్పు పడుతున్న వారిపై ఏబీవీ ఎదురుదాడి చేస్తున్నారు. ఈ విషయంలో ‘‘నన్ను అభిమానించే వాళ్ల అనుమానాలు (మా అమ్మ తో సహా) తీర్చేందుకు’’ అంటూ నిన్న సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చిన ఏబీవీ ఈ రోజు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు భావించే ఓ పత్రికను విమర్శిస్తూ ఘాటైన ట్వీట్ వదిలారు.
టీడీపీ సోషల్ మీడియా, సానుకూల మీడియాతో తాడోపేడో తేల్చుకుందామన్న స్థాయిలో ఏబీవీ ఆయన సన్నిహితుడు నల్లమోతు చక్రవర్తి వరుస ట్వీట్లు, పోస్టులతో హోరెత్తిస్తున్నారు. వైసీపీతో ఏబీవీకి అవగాహన కుదరిందన్న అనుమానాలు కలిగించేలా ఓ పత్రిక కథనం రాసిందని ఆరోపిస్తూ ఏబీవీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఏబీవీ ఫోన్ ట్యాపింగ్ పై జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. తన వాంగ్మూలం ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురి ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వినిపిస్తుండగా, అందులో ఏబీవీ ఫోన్ కూడా ఉందని చెబుతున్నారు. దీనిపై పోలీసులకు తగిన సమాచారం ఇచ్చిన అనంతరం ఏబీవీ తన సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియజేశారు.
దీనిపై ఓ అంగ్ల పత్రికలో కథనం వెలువడగా, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పే ఓ పత్రికపై సెటైర్లు పేల్చుతూ ఏబీవీ తాజాగా ఓ పోస్టు రాశారు. ‘‘ఇలా వచ్చినా ఆశ్చర్యపోవద్దు సుమీ!’’ అంటూ వ్యంగ్యాస్తం సంధించడమే కాకుండా ‘‘పదవి దక్కని అక్కసుతో ఆ మాజీ ఐపీఎస్ BRS తో కలిసి కుట్రలు చేస్తున్నట్టు తెలిసింది’’ అంటూ రాస్తారని దెప్పిపొడిచారు. అంతేకాకుండా ‘‘మాయాంధ్ర జ్యోతి, సొమ్మున్న పత్రిక’’ అంటూ ఆ పత్రిక ట్యాగ్ లైన్ అందరికీ అర్థమయ్యేలా ట్వీట్ చేశారు. అంతేకాకుండా ‘‘మా అక్షరమే మా ఆదాయాయుధం’’ అంటూ సదరు పత్రికపై మండిపడ్డారు. ఇక ఏబీవీ మాత్రమే కాకుండా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా భావించే ప్రముఖ సామాజిక కార్యకర్త నల్లమోతు చక్రవర్తి సైతం ఆ పత్రికపై విమర్శలతో ఫేస్ బుక్, ఎక్స్ లో పోస్టులు పెట్టారు.
‘‘సిగ్గూ శరం పూర్తిగా గాలికి వదిలేసినట్లున్నారు. ఏబీవీ వైసీపీ వాళ్ళతో చేతులు కలపడం ఏంటి?’’ అంటూ నల్లమోతు చక్రవర్తి ఫైర్ అయ్యారు. అంతేకాకుండా మైండ్ పూర్తిగా పోయిందా? అంటూ విరుచుకుపడ్డారు. ‘‘మీరు రేపు ఒసామా బిన్ లాడెన్, మధర్ థెరిస్సా కలిసి ట్విన్ టవర్స్ కూల్చారు అని కూడా రాయగలరు. జనాలు గొర్రెలు, మేము ఏ చెత్త రాసినా నమ్ముతారు అనే అహంకారం ఉంటే పత్రిక మూలన పడుతుంది.’’ అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లలో వివరాలు లీక్ చేస్తూ ప్రభుత్వం దిగజారిపోయినట్లు వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో తాను వైసీపీకి చెందిన కొందరితో కలిసి ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ పత్రిక రాసిన కథనంపైనా ఏబీవీ స్పందించారు.
ఈ విషయంలో పోలీసులు శ్రమ పడకుండా, లీకులిచ్చే బాధ లేకుండా “అసలేం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? నాకు తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి” అని మాడిపోయిన మసాలా దోసె తింటూ తింటూ ఆపేసిన కుతూహల రావు లందరికీ ఉపశమనం కలగబోతోందని చెబుతూ తన ఫోన్ లో ఉన్న సంబంధిత స్క్రీన్ షాట్స్ అన్నీ బహిరంగ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఈ పరిణామాలు పరిశీలిస్తుంటే ఏబీవీకి టీడీపీ మీడియాకు మధ్య యుద్ధం పతాకస్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ ప్రచ్ఛన్న యుద్ధం ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తుందా? లేక ఇక్కడితో ముగిస్తారా? ఎవరు ఎంతవరకు వెళతారనేది చూడాల్సివుందని అంటున్నారు.