ఎలక్షన్ ఎఫెక్ట్: మహిళలకు నెలకు 3 వేలు.. బీజేపీ మేనిఫెస్టో!
ఈశాన్య రాష్ట్రంలో అసోంలో వరుసగా మూడోసారి కూడా విజయం దక్కించుకునేందుకు బీజేపీ తనదైన శైలిలోముందుకు సాగుతోంది.;
ఈశాన్య రాష్ట్రంలో అసోంలో వరుసగా మూడోసారి కూడా విజయం దక్కించుకునేందుకు బీజేపీ తనదైన శైలిలోముందుకు సాగుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు వరుసగా బీజేపీ రెండుసార్లు ఇక్కడ విజయం దక్కించుకుంది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న సంకల్పంతో ఉన్న బీజేపీ.. ఎన్నికల సందర్భంగా మహిళలపై వరాల జల్లు కుపిరించారు. తాము మూడోసారి కూడా అధికారంలోకి వస్తే.. నెలకు రూ.3000 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించారు.
తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధానంగా మహిళల సెంట్రిక్‌గానే హామీలు గుప్పించడం గమనార్హం. `అరుణోదయ` పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 3 వేల చొప్పున ఆర్థిక సాయంతో పాటు.. మరో 40 లక్షల మంది మహిళలకు లఖ్‌పతి దీదీ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. వచ్చే ఐదేళ్లలో 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
అలాగే.. మరో కీలకమైన హామీ.. బంగ్లాదేశ్‌కు చెందిన మియామీలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుని లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఈ వాదన కొన్ని దశాబ్దాలుగా ఉంది. దీని కోసం అస్సామీలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. తాజాగా బీజేపీ ఈ హామీని మేనిఫెస్టోలో చేర్చడం గమనార్హం. ఇక, బ్రహ్మపుత్ర నది కారణంగా.. తరచుగా అస్సాంలో వరదలు వస్తుంటాయి. పలు జిల్లాల ప్రజలు ఇళ్లను, ఆస్తులను కూడా కోల్పోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వరదల నివారణకు బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది.
ఇక, ఉమ్మడి పౌరస్మృతి పై కూడా కీలక ప్రకటన చేసింది. అస్సాంలో మూడోసారి అధికారంలోకి వస్తే.. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనున్నట్టు తెలిపింది. అయితే.. దీనిని ఎస్టీ ప్రాంతాలకు మినహాయి స్తామని తెలిపింది. కాగా.. బీజేపీ ఆశలన్నీ.. ఫైర్‌బ్రాండ్ నాయకుడు, సీఎం హిమంత బిశ్వశర్మ ఇమేజ్‌పైనే ఉన్నాయి. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఆయన హయాంలోనే రెండు సార్లు బీజేపీ విజయం దక్కించుకుంది.