చంద్రబాబుకు మొదటి అనుభవం

Update: 2020-12-01 08:59 GMT
వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా జరిగిన గొడవకు తెలుగుదేశంపార్టీకి చెందిన 14 మంది ఎంఎల్ఏలను స్పీకర్ ఒక్కరోజు సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 14 మందిలో టీడీపీ శాసనసభాపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా ఉన్నారు. చంద్రబాబును కూడా స్పీకర్ సస్పెండ్ చేయగానే అందరు ఆశ్చర్యపోయారు. అసెంబ్లీ అన్నాక ఎంఎల్ఏలు గొడవలు చేయటం, ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవటం మామూలే. ఈ క్రమంలోనే శృతిమించిన ఎంఎల్ఏలను స్పీకర్ సస్పెండ్ చేయటం కూడా అందరికీ తెలిసిందే.

కానీ ఇక్కడ చంద్రబాబును కూడా స్పీకర్ సస్పెండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు సస్పెన్షన్ విషయంలో ఎందుకు ఆశ్చర్యమంటే తన రాజకీయ జీవితంలో చంద్రబాబు మొదటిసారి సస్పెండ్ అయ్యారు. 1978లో చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎంఎల్ఏగా గెలిచారు. 1983లో ఓడిపోయిన చంద్రబాబు 1984లో జరిగిన మద్యంతర ఎన్నికల్లో పోటీ చేయలేదు. తర్వాత 1989లో చంద్రగిరి నుండి కుప్పం నియోజకవర్గానికి వలసపోయారు. అప్పటి నుండి అక్కడ వరసుగా గెలుస్తునే ఉన్నారు.

దాదాపు 7 పర్యాయాలు కంటిన్యువస్ గా ఎంఎల్ఏగా గెలుస్తున్న చంద్రబాబు మధ్యలో ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. ప్రతిపక్షంలో ఎప్పుడున్నా, ఎంఎల్ఏలు సస్పెండ్ అయినా ఏ అధికారపార్టీ కూడా చంద్రబాబును సస్పెండ్ చేయలేదు. కానీ ఇపుడు మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సస్పెండ్ అయ్యారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబుపై సస్పెన్షన్ వేటు పడటానికి స్వయంకృతమే కారణమని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్ష ఎంఎల్ఏలు ఎంతగా గోల చేసినా, స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి నిరసన తెలిపినా ప్రతిపక్ష నేత మాత్రం తన సీటులోనే కూర్చునుంటారు. సైగల ద్వారానో లేదా ఏదో ఎంఎల్ఏతో కబురు చేసో గొడవలు చేయిస్తారనటంలో సందేహం లేదు.

కానీ స్వయంగా ప్రతిపక్ష నేతే స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి ఎప్పుడు గొడవ చేయలేదు. ఇక్కడ చంద్రబాబు చేసిందిదే. సభలో తమ ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడే మాట్లాడుతున్నా తాను మాట్లాడేందుకు అనుమతివ్వాలంటు చంద్రబాబు గోల మొదలుపెట్టారు. దాంతో అధికారపక్ష సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించినపుడు గొడవ పెరిగిపోయింది. దాంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయి స్పీకర్ పోడియం దగ్గర కూర్చుని నిరసన మొదలుపెట్టారు. దాంతో సభ నుండి సస్పెండ్ చేశారు. ఇదంతా చూస్తుంటే సభలో కావాలనే రచ్చ చేసి సస్పెన్షన్ వేటు వేయించుకోవాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
Tags:    

Similar News