జపానోళ్లకు చిన్నిల్లు చూపించిన చంద్రబాబు

Update: 2016-05-23 11:16 GMT
ఏపీ సీఎం చంద్రబాబు జపాన్ ప్రతినిధులకు చిన్నిల్లు చూపిస్తున్నారు. షాక్ అవ్వొద్దు.. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబుకు ఇవేం పనులనుకుంటూ ఆ అర్థంలో చూడొద్దు. చంద్రబాబు అలాంటి పనులకు చాలా దూరమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన చూపిస్తున్న చిన్నిల్లు ఏపీ అభివృద్ధి కోసం మాత్రమే. అవును... ఏపీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలనుకుంటున్న జపాన్ వారిని ఉత్సాహపరిచేందుకు, సాదర స్వాగతం పలికేందుకు చంద్రబాబు ఆ మాట చెప్పారు. ఏపీ నూతన రాజధాని అమరావతిని రెండో ఇల్లుగా చేసుకోవాలని వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని రెండో ఇల్లుగా భావించమని జపాన్ బృందానికి తాను చెప్పానని చంద్రబాబునాయుడు చెప్పారు. చంద్రబాబుతో జపాన్ బృందం ఈరోజు సమావేశం కాగా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. రాజధాని నిర్మాణ బాధ్యతలు జపాన్ ప్రభుత్వానిదేనని, ఆ దేశానికి మాకీ సంస్థ ఆధ్వర్యంలో నవ్యాంధ్ర రాజధాని భవనాల డిజైన్ జరగనుందని చెప్పిన ఆయన అమరావతిని తమ దేశంలోని ప్రాజెక్టుగానే భావించి నిర్మించాలని సూచించారు. ఆ క్రమంలో ఆయన అమరావతిని రెండో ఇల్లుగా చేసుకోవాలని జపాన్ ప్రతినిదులతో  అన్నారు.

అమరావతి భవనాలను డిజైన్ చేసిన మీరే నిర్మాణాల బాధ్యత తీసుకోవాలని జపాన్ బృందానికి చంద్రబాబు సూచించారు. జపాన్ కు చెందిన వెయ్యి కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టనున్నాయన్నారు. ఈ ఏడాదిలో 150 జపాన్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడతాయని చంద్రబాబు పేర్కొన్నారు.  కాగా జపాన్ భాగస్వామ్యం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భారీగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్ వారి కోసం ఇక్కడ ప్రత్యేక ఆవాసాలను కూడా ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ఇప్పటికే  హామీ ఇవ్వడం తెలిసిందే.
Tags:    

Similar News