ఆ వైసీపీ నేతలపై వీడియోల వెనుక ఎవరు? ఇంకా ఎందరు టార్గెట్?

రాజకీయాలంటేనే ఎత్తులు, పైఎత్తులు. అవసరమైనచోట కుయుక్తులు.. ఇంకా చెప్పాలంటే అనేక వ్యూహాలు

Update: 2024-05-06 10:01 GMT

రాజకీయాలంటేనే ఎత్తులు, పైఎత్తులు. అవసరమైనచోట కుయుక్తులు.. ఇంకా చెప్పాలంటే అనేక వ్యూహాలు. ఎన్నికల వేళ అయితే ఇలాంటివి ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు మహా వేడిగా ఉన్న సమయంలో బయటకు వచ్చిన రెండు వీడియో సందేశాలు చర్చనీయాంశంగా మారాయి. రెండింటిలోనూ సామీప్యం ఉండడమే దీనికి కారణం.

కీలక నేతలపైనే?

ఏపీలో ప్రధాన సామాజిక వర్గం కాపు. ఈ సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం దశాబ్దాలుగా బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. కానీ, అది సాకారం కావడం లేదు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన పద్మనాభం ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. మళ్లీ ఈ ఎన్నికల సమయంలో ఆయన పేరు వినిపిస్తోంది. కొన్ని నెలల కిందట ఏకంగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడంతో సహజంగానే ఇప్పుడు టీడీపీ-జనసేన కూటమికి విరోధి అయ్యారు. వైసీపీలో చేరికకు అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తీవ్రంగా విమర్శించారు ముద్రగడ. కాగా, ప్రస్తుతం పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు పద్మనాభాన్ని వైసీపీ ఆయుధంగా ఎంచుకుంది. అయితే, ఈ వ్యవధిలోనే పద్మనాభంకు ఊహించని షాక్ తగిలింది. స్వయంగా ఆయన కుమార్తెనే వీడియో రిలీజ్ చేశారు. ముద్రగడ ఆలోచనలను తప్పుబట్టారు. ఇక రెండో వీడియో ఏపీ మంత్రి అంబటి రాంబాబు గురించి. పోలింగ్ కు వారం రోజులు ఉందనగా, రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ తన మామను ఉద్దేశిస్తూ తీవ్ర పదజాలంతో వీడియో విడుదల చేశారు. అంబటికి ఓటేయవద్దంటూ చాలా సరళమైన భాష, స్వచ్ఛమైన తెలుగులో డాక్టర్ గౌతమ్ చెప్పిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అంబటి కూడా స్పందించారు.

ముద్రగడ, అంబటి.. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం.. అందులోనూ వీరిని జనసేన అధినేత పవన్ పైకి ప్రయోగిస్తోంది వైసీపీ. ప్రచారంలో అటు పవన్ కూడా వీరిద్దరి పేర్లను రోజూ ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే వారిద్దరినీ వ్యతిరేకిస్తూ కుటుంబ సభ్యుల నుంచి వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. దీని వెనుక ప్రత్యర్థి పార్టీల వ్యూహం ఏమైనా ఉందా? అనే ఆలోచన వస్తోంది. పోలింగ్ మరీ దగ్గర పడుతుందనగా వైసీపీ ప్రధాన నేతలు, మరీ ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందినవారి ఇంకెవరి కుటుంబ సభ్యుల వీడియో బయటకు వస్తుందో?

కొసమెరుపు: వైసీపీలో చేరీచేరని అంబటి రాయుడిని తమవైపు ఆకర్షించింది జనసేన. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ కాపు నేతలను టార్గెట్ చేస్తూ వీడియోలు వస్తున్నాయి. ఒకవేళ ఇది కూడా జనసేన వ్యూహమే అయితే.. ఫక్తు రాజకీయ పార్టీగా జనసేన ఎదిగినట్లే..?

Tags:    

Similar News