నిరసనకు కూడా జపాన్ మోడలేనా బాబూ

Update: 2018-02-21 13:30 GMT

జపాన్ లో ఎక్కువ పనిచేసి అక్కడి ప్రజలు  తమ నిరసనలను వ్యక్తం చేస్తారు. అదే తరహాలో మనం ఇప్పుడు కేంద్రం మనకు చేసిన అన్యాయం పట్ల జపాన్ తరహాలో నిరసనలు వ్యక్తం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటున్నారు. ‘జపాన్ మోడల్ నిరసన’ అంటే ఆయన ఉద్దేశం ఏమిటో మాత్రం అర్థం కావడం లేదా? కేంద్ర ప్రభుత్వానికి ఏం పనులు ఎక్కువ చేసి.. ప్రజలు నిరసన తెలియజేయాలి? అనే సందేహం  ప్రజలకు కలుగుతోంది.

చంద్రబాబునాయుడు గారికి ఈ మధ్య కాలంలో జపాన్ పిచ్చి బాగా పట్టుకుంది. అమరావతి నగరాన్ని జపాన్ దేశమే అభివృద్ధి చేసేస్తుందంటూ ఆయన కొన్నాళ్లు ఊరేగిన సంగతి తెలిసిందే. ఆరోజుల్లో జపాన్ కు ఎక్కడలేని ప్రచారం కల్పించారు. ఏపీ యూత్ మొత్తం ఇంగ్లిషుతో పాటూ జపనీస్ భాష కూడా నేర్చుకుంటే భవిష్యత్తు బంగారు మయం అయిపోతుందంటూ.. ఎన్నెన్నో కబుర్లు చెప్పారు. ఏపీ యూనివర్సిటీలలో జపనీస్ భాష నేర్పించే విభాగాలను కూడా ఏర్పాటు చేయించారు. ఇంతా చేసిన తర్వాత.. జపాన్ అమరావతి ప్రాజెక్టు  నుంచి గుట్టు చప్పుడు కాకుండా తప్పుకుంది. చంద్రబాబునాయుడు కూడా తేలు కుట్టిన దొంగ సామెత లాగా సైలెంట్ అయిపోయారు.

ఇన్నాళ్లకు ఆయన మళ్లీ జపాన్ పాట పాడుతున్నారు. ఇంతకూ కేంద్రం విభజన చట్టం మోసాలు చేసినందుకు, ప్రత్యేకహోదా ఇవ్వనందుకు ప్రజలు జపాన్ తరహాలో ఎలా నిరసన వెలిబుచ్చాలి. ఎక్కువ పనిచేయాలా? కేంద్రానికి ఎక్కువ రుచి ఎలా చెప్పాలి? ఉపాధి కూలీలు - అదే కూలి డబ్బుకు ఎక్కువ పనిచేయాలా? కేంద్రానికి చెల్లించే పన్నులు ఎక్కువ చెల్లించాలా? అని ప్రజలు వెటకారంగా అడుగుతున్నారు.

జపాన్ లో ఎక్కువ పనిచేసే నిరసన అనేది వస్తు ఉత్పాదక పరిశ్రమలకు సంబంధించిన సమ్మె తీరు. కార్మికులకు కోపం వస్తే ఎక్కువ ఉత్పత్తి చేసేస్తే.. వాటిని అమ్ముకోలేక కంపెనీ ఇబ్బంది పడుతుందనేది వ్యూహం. కానీ.. ఇక్కడ కేంద్రాన్ని జపాన్ మోడల్ లో ఎలా ఇబ్బంది పెట్టగలరు. మనదేశంలో మన సమస్యకు సరిపోగల మనదైన నిరసనకు  కూడా మనకు గతి లేదా బాబుగారూ, నిరసన ఆలోచనను కూడా అరువు తెచ్చుకోవాల్సిందేనా? అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ జపాన్ అభిమానాన్ని కొంత దాచుకోవాలని.. హోదాకోసం ఆటైపు నిరసనలంటే.. పిడుక్కీ పెళ్లికీ ఒకటే మంత్రం చదివినట్టుంటుందని ప్రజలు అంటున్నారు.
Tags:    

Similar News