మంత్రులకు చంద్రబాబు వివరణలు!

Update: 2015-05-24 22:30 GMT
ఎవరైనా తప్పు చేస్తే వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది! ప్రతిపక్షాలు అడ్డగోలు ఆరోపణలు చేస్తే ప్రజలు తప్పుదారి పట్టకుండా వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది! కానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. తన మంత్రివర్గంలోని మంత్రులు చేసిన విమర్శలకు ఆయన వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. తనను అర్థం చేసుకుని సహకరించాలని కోరుకోవాల్సి వస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుచుకున్న పశ్చిమ గోదావరి జిల్లాకే ఆయన పెద్దపీట వేస్తున్నారని, కేవలం మూడే సీట్లు గెలవడంతో కర్నూలును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాలో మిగిలిన 11 సీట్లూ ఎందుకు గెలవలేదని నిలదీస్తున్నారని, చివర్లో తీసుకున్న కాంగ్రెస్‌ నేతలే ఆ స్థానాల్లో ఓడిపోయారని కూడా వివరణ ఇస్తున్నారు. ఇక మరో మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే రోజుకోసారి చంద్రబాబుకు తలపోటు తెస్తూనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన పేషీ తలపోటుగా మారితే ఇప్పుడు తమ అధికారంలో అధికారులను తమ ఇష్టం వచ్చినట్లు బదిలీ చేసుకుంటామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక నిన్న మొన్నటి వరకు మరో మంత్రి రావెల కిశోర్‌ బాబు గుంటూరు జిల్లాలో వివాదాలకు తెరతీసేవారు.

ఇప్పుడు మంత్రులు చేసిన ఆరోపణలకు కూడా చంద్రబాబు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. కేఈ వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇచ్చుకున్నారు కూడా. చరిత్రలో కర్నూలును అభివృద్ధి చేసింది తానేనని, ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని, కాదన్నవాళ్లు ముందుకు రావాలంటూ సవాల్‌ విసిరారు. మంత్రులు అర్థం చేసుకుని మాట్లాడాలని కోరుతున్నారు. తెలంగాణలో మంత్రులకు అసలు మాట్లాడే అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రల నోటికి అడ్డే లేకుండా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News