డెడ్‌ లైన్‌ చెబితే తప్ప చంద్రబాబును నమ్మలేం!

Update: 2016-08-24 11:30 GMT
తన రాజకీయ ప్రత్యర్థుల గురించి ఎప్పుడు ఏం మాట్లాడాల్సి వచ్చినా సరే.. 'నాటకాలు' అనే మాటను చంద్రబాబు చాలా తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. 'నాటకాలు ఆడుతున్నారు' అంటూ కాంగ్రెస్‌ వైకాపాలను తిట్టడం ఆయనకు రివాజు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎంతో కీలకమైన ప్రత్యేకహోదాను సాధించే విషయంలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తరఫున ఆయన చేస్తున్నది ఏమిటో మాత్రం.. మనకు ఎన్నటికీ అర్థం కాదు. ఆయన చెప్పినట్లుగా రాజకీయ ప్రత్యర్థులు ఆ పని చేస్తున్నారో, చంద్రబాబే ఆ పనిలో ఉన్నారో మనకి బోధపడదు.

ప్రత్యేకహోదా మీద చంద్రబాబుకు ఆసక్తి లేదు. రెండేళ్లపాటూ.. అదేమీ సర్వరోగ నివారిణి కాదు కదా.. దానికంటె మిన్నగా ప్యాకేజీలు తీసుకొస్తాం అంటూ ఆయన ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఒకసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద స్థాయిలో ఉద్యమాలు చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక అవగాహన కలిగించిన తరువాత.. చంద్రబాబులో దాని గురించి భయం పట్టుకుంది. ప్రత్యేకహోదా గురించి మాట్లాడకపోతే జనం తనను ఛీత్కరించుకుంటారని ఆయన అర్థం చేసుకున్నారు. అప్పటినుంచి ప్రతిచోటా ప్రత్యేకహోదా తప్పకుండా సాధిస్తాం... అంటూ అరిగిపోయిన రికార్డు వేయడం ప్రారంభించారు. తాజాగా కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమంలో కూడా అదే సెలవిచ్చారు.

తననెవరూ నిందించకుండా.. చంద్రబాబుకు ప్రత్యేకహోదా అనేది ఒక కవచంలా వాడుకోవడానికి ఉపయోగపడుతోంది. అంతే తప్ప.. ఆయన ప్రభుత్వం తరఫున గానీ, తన పార్టీ ఎంపీల ద్వారా గానీ ఎలాంటి కచ్చితమైన ప్రయత్నమూ చేయడం లేదు. ప్రత్యేకహోదా సాధించే వరకూ పోరాడుతాం ... అంటూ సోది డైలాగులు చెప్పకుండా.. ఎప్పటికి సాధించాలనేది చంద్రబాబు డెడ్‌ లైన్‌ గా పెట్టుకున్నాడో ప్రజలకు ఆయన జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. తనకు ఇష్టం లేని విషయాల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి జీవితకాలంపాటూ నానుస్తూనే ఉండగల ప్రతిభ ఉన్న చంద్రబాబునాయుడు, డెడ్‌ లైన్‌ అంటూ ఖచ్చితంగా చెబితే తప్ప ఆయన మాటల్ని నమ్మడానికి వీల్లేదని జనం అనుకుంటున్నారు.
Tags:    

Similar News