పోలవరం ముగిశాక.. అమరావతిలో అదే మాయ!

Update: 2018-02-15 02:30 GMT
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దైనందిన షెడ్యూలు.. వాటికి ఇదివరకు దక్కుతున్న ప్రచారం.. ఇప్పుడు వస్తున్న ప్రచారం.. మీడియాకు అందిస్తున్న వివరాల  మోతాదు ఇత్యాది అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఈ సంగతి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి షెడ్యూలులో ‘‘ప్రతి సోమవారం.. పోలవారం’’ అంటూ ఇదివరలో అదే పనిగా ఊదరగొట్టేవారు. కొన్ని వారాలుగా.. నామమాత్రంగా సోమవారం- పోలవరం సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి గానీ.. వాటి గురించిన వివరాలు మాత్రం మీడియాకు పరిమతంగానే విడుదల చేస్తున్నారు. ఎందుకంటే.... అక్కడ పనులు అన్నీ అంత ఘోరంగా మందకొడిగా సాగుతున్నాయి.

ఈ సమయంలో పోలవరం పనుల పేరు చెప్పి.. ఇదిగో అయిపోతోంది.. అదిగో అయిపోతోంది అంటూ కబుర్లు చెబితే.. ప్రజలు కన్నెర్ర చేయడం గ్యారంటీ. అదే భయం చంద్రబాబులో ఉన్నట్లుంది. ఇప్పుడిక ఆయన కొత్త పాట ప్రారంభిస్తున్నారు. పోలవరంలో ఏ రకంగా అయితే డ్రోన్లతో పరిశీలన.. రియల్ టైం పనులను అమరావతినుంచే పరిశీలించడం లాంటి మాయమాటలు చెబుతూ ఈ దుస్థితికి తీసుకువచ్చారో.. ఇప్పుడు అదే  మాయను అమరావతి విషయంలో కూడా వర్తింపజేస్తున్నారు.

అమరావతిలో ప్రారంభించిన అన్ని నిర్మాణాలు - ఇతర పనులు సమస్తం ఏదశలో జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందిస్తూ ఉండాలని.. ప్రతివారం పనుల పరోగతిని డ్రోన్లతో తీసిన ఫోటోలతో నివేదికలను తనకు అందించాలని చంద్రబాబునాయుడు హడావిడి ప్రారంభించారు. పోలవరం కథ ముగిసిన తర్వాత.. ఇప్పుడు చంద్రబాబు అమరావతి అంతు తేల్చడానికి డ్రోన్ల ప్రయోగం మాటెత్తుతున్నట్లున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

అమరావతిలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ నిర్మాణం ఊసు ఇప్పటిదాకా లేదు. వందల వందల ఎకరాలను అప్పనంగా తీసుకున్న కొన్ని యూనివర్సిటీలు మాత్రం.. కాస్త నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాంటిది సర్కారు ఎలాంటి నిర్మాణాలూ చేయనిచోట, చేయడానికి సర్కారు వద్ద ఒక్కరూపాయి కూడా లేని చోట.. ప్రతి వారం డ్రోన్లతో ఫోటోలు తీస్తూ ఉంటే ఏం తేడా కనిపిస్తుందా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రతివారం తీస్తున్న ఈ డ్రోన్ల ఫోటోలు ముఖ్యమంత్రికి ఇచ్చే నివేదికలను దాటి మీడియాకు వెళ్లాయంటే ప్రభుత్వానికి ఉన్న పరువు కూడా పోతుందని భయపడుతున్నారు.

Tags:    

Similar News