అన్నీ వదిలేసి..అదొక్కటే పట్టుకున్న బాబు!

Update: 2016-08-26 04:19 GMT
తాను కృష్ణా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించేశాడు గనుక.. ఇక రాష్ట్రం ఎదుట ఉన్న సకల సమస్యలను ప్రజలు మరచిపోయి ఉంటారని చంద్రబాబునాయుడు ఫిక్సయిపోయినట్లుగా ఉంది. ఇక ఆయన తన తర్వాతి ప్రాధాన్య అంశాల మీద దృష్టి సారించారు. బాబు ప్రభుత్వం ప్రస్తుతం తక్షణం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నియోజకవర్గాలను పెంచుకోవడం మీద దృష్టిసారిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయంగా తాను ఎందరికి ఎలాంటి మాయ హామీలు ఇచ్చాడో ఆయనకు మాత్రమే తెలుసు గనుక.. అవన్నీ తీర్చాలంటే.. నియోజకవర్గాల పెంపు ఒక్కటే శరణ్యమని.. దానికోసం ఆయన వెంపర్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ సెగ్మెంట్లను 175 నుంచి 225 కు పెంచడానికి ప్రభుత్వం ఆరాటపడిపోతోంది. అయితే ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 అడ్డం వస్తోంది. కానీ విభజన చట్టం ప్రకారం తమకు వెంటనే నియోజకవర్గాలు పెంచేయాలని ప్రభుత్వం రకరకాల వాదనలు కేంద్రం ముందు పెడుతోంది. సెగ్మెంట్లను పునర్విభజన చేయడానికి మాత్రమే రాజ్యాంగ నిబందన అడ్డు వస్తుందని, తమకు కావాల్సింది నియోజకవర్గాల పెంపు గనుక.. దానితో నిమిత్తం లేకుండా చేయాలని చంద్రబాబు సర్కారు వాదనలను తయారుచేసి.. దాదాపుగా పెద్ద పోరాటం నడుపుతోంది.

అయితే ఇక్కడ జనం విస్తుపోతున్నదేంటంటే.. రాజకీయ అవసరాల కోసం మాత్రం ఇంత శ్రద్ధ చూపిస్తున్న చంద్రబాబు.. అదే విభజన తర్వాత ఏపీకి అవసరమైన ప్రత్యేకహోదా - పోలవరానికి నిధులు వంటి విషయంలో ఇంతే శ్రద్ధగా కేంద్రంతో బహిరంగ పోరాటం ఎందుకు చేయడం లేదు అని. ఆయనకు తన రాజకీయ అవసరాల మీద ఉన్న శ్రద్ధ  - రాష్ట్ర అవసరాల మీద ఉన్నట్లుగా కనిపించడం లేదని భావిస్తున్నారు.
Tags:    

Similar News