చిరంజీవి కోసం ఏం ప్లానేసావ్ చంద్రబాబు

Update: 2018-06-22 05:42 GMT
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అందరి చూపు వారివైపే.. వారు ఎటువైపు నిలబడితే అధికారం వారిదేనన్న నమ్మకం అనాధిగా బలపడింది.. వారే కాపులు.. అవును కాపు సామాజికవర్గంలో ఏపీలో రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. ఏపీ జనాభాలో దాదాపు 25శాతానికి దగ్గర్లో కాపులు ఉన్నారు. అందుకే ప్రతి ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకమవుతాయి.. అందుకోసమే పార్టీలన్నీ కాపులను మచ్చిక చేసుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి..

అది 2009.. కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో ఎన్నికల కదనరంగంలోకి దిగారు. అప్పటికే 5 ఏళ్లు పాలించిన వైఎస్ - ప్రతిపక్షంలో ఉన్న టీడీపీతో ఢీ అంటే ఢీ అన్నారు. గెలవలేదు కానీ కాపుసామాజిక వర్గం ఓట్లను చీల్చారు. దీంతో టీడీపీ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికీ తాను 2009లో గెలవకపోవడానికి చిరంజీవీయే కారణమని చంద్రబాబు ఆడిపోసుకుంటారు. సందర్భం వస్తే చాలు చిరంజీవిని తన నేతలతో తిట్టిపోస్తుంటాడు.

ఇక 2014లోనూ కాపులు తీవ్ర ప్రభావం చూపించారు. కానీ ఈసారి బొమ్మ టీడీపీకి పడింది. చంద్రబాబు అధికారం కోసం బీజేపీని - పవన్ ను ఆశ్రయించి మద్దతు కూడగట్టి అధికారంలోకి వచ్చారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. వారికి నానా రకాల ఆశ చూపారు. కానీ గద్దెనెక్కాక అవన్నీ మరిచిపోయారు. దీంతో ముద్రగడ సహా కాపు నేతలంతా చంద్రబాబుపై యుద్ధానికి దిగారు. వారిని ఉక్కుపాదంతో అణిచివేసిన చంద్రబాబు  ఇప్పుడు 2019లో మరోసారి కాపుల మద్దతు కూడగట్టేందుకు మళ్లీ తెరవెనుక ప్రయత్నాలకు తెరతీశారు.

ప్రత్యేక హోదా సహా అన్ని విషయాల్లో మోసం చేసిన చంద్రబాబు వైఖరి నచ్చక పవన్ స్నేహాన్ని వదిలారు. బాబు టార్గెట్ గా రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. పవన్ కళ్యాణ్ దూరమవడం.. మళ్లీ కలిసే చాన్స్ లేకపోవడంతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. పవన్ అన్నయ్య చిరంజీవికి గాలం వేయడం ప్రారంభించాడు. ఇందుకోసం చంద్రబాబు  మంత్రి కొల్లు రవీంద్రను రంగంలోకి దించారు.

కొల్లు రవీంధ్ర తాజాగా చిరంజీవిని కలిశారు. చిరంజీవి రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధుల సాయంతో మచిలీపట్నంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు ప్రభుత్వం చేసింది. ఆ కార్యక్రమాల పురోగతి గురించి మంత్రి కొల్లు రవీంద్ర చిరంజీవికి తెలియజేశారు. చిరంజీవిని మచ్చిక చేసుకోవడానికి ఇలా బాబు వేసిన ప్లాన్ లో భాగంగా ఇదంతా జరిగింది.

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి చిరంజీవిని ఆహ్వానించారు మంత్రి రవీంద్ర. అంతేకాదు చంద్రబాబు చెప్పిన మాటలను కూడా చిరంజీవి చెవిన వేశాడట రవీంద్ర. దీనికి చిరంజీవి వస్తానని.. రాలేదని చూచాయగా చెప్పలేదట..

మొన్నటివరకు ‘కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి ఏపీకి ఏం చేశాడని’ నిలదీసిన టీడీపీ నేతలు ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఎంపీ పదవి నుంచి వైదొలిగి సినిమాలు చేసుకుంటున్న చిరంజీవిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అంతో ఇంతో దూరమైన కాపు ఓటు బ్యాంకును చిరంజీవి ద్వారా సంపాదించుకునేందుకే బాబు ఈ ప్లాన్ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News