మోడీ మ‌న‌సు గెలిచిన బాబు

Update: 2015-10-14 19:38 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించినట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో స‌మావేశం అయిన అనంత‌రం ఢిల్లీలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22న ప్రధాని మోడీ పర్యటన ఖరారైందని తెలిపారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌ జైట్లీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీని ఆహ్వానించినట్లు చెప్పారు. అమ‌రావ‌తి శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని అన్నారు. సాంప్రదాయం ప్రకారం 16 వేల గ్రామాల నుంచి నీరు, మట్టిని రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, అందరి భాగస్వామ్యం ఉండేలా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి అందరి ఆశీస్సులు, సహకారం కావాలన్నారు.

అంత‌కుముందు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో నీతి ఆయోగ్ ముఖ్యమంత్రుల సబ్ కమిటీ ప్రధానిని కలుసుకుంది. స్వచ్ఛ భారత్ పై నీతి ఆయోగ్ సబ్ కమిటీ త‌న‌ నివేదికను సమర్పించింది. ఈ సంద‌ర్భంగా చంద్రబాబును ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. గడువులోగా స్వచ్ఛ భారత్‌ నివేదిక ఇచ్చారని అభినందనలు తెలిపారు. స్వచ్ఛ భారత్‌ నివేదిక అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్ర‌ధానితో త‌మ స‌మావేశం గురించి చంద్రబాబు మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ లక్ష్యాన్ని సాధించడం కష్టమే కానీ అసాధ్యం కాదని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా గురించి త‌మ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చంద్ర‌బాబు పున‌రుద్ఘాటించారు. వైసీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌ జగన్ దీక్ష గురించి మాట్లాడుతూ... జ‌గ‌న్ దొంగదీక్షలు కాకుండా మామూలు దీక్షలు చేస్తే ప్రజలు నమ్ముతారని ఎద్దేవా చేశారు.
Tags:    

Similar News