20 ఏళ్లు మాదే అధికారం అంటున్న బాబు

Update: 2017-04-28 04:57 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త‌న ప‌రిపాల‌న‌, ప్ర‌జ‌ల్లో త‌నకు ఉన్న ఆద‌ర‌ణ‌పై తెగ భ‌రోసాతో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం అధికారం చేప‌ట్టి ఇప్ప‌టికే దాదాపు మూడేళ్లు పూర్తి చేసుకున్న చంద్ర‌బాబు రాష్ట్రంలో 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటామని  ధీమా వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ కామెంట్‌తో పాటు మ‌రికొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశాలు పంచుకున్నారు.

తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నిక‌ల్లో ఓడిపోతే, చంద్ర‌బాబు సీఎం కాక‌పోతే ఎలా  విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాబు అన్నారు. అలాంటి ప‌రిస్థితి ఎదురవ‌ద‌ని వ్యాఖ్యానించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనను ఒక ప్రశ్న అడుగుతున్నారని చంద్ర‌బాబు తెలిపారు. ‘దేశంలో మళ్లీ ఎన్నికలు వచ్చి ఒకవేళ మీరు ఓడిపోతే మా పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. మేము కష్టాలు పడాల్సిందేనా?అని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే సమస్యే లేదు. 20 ఏళ్లు అధికారంలో  మేమే ఉంటాం`` అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఏదో చేయాలని తొందరపడి పరుగెత్తడం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చిందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈసారి అలాకాకుండా సుస్థిర పాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నానని తెలిపారు. ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వారే 2019లో గెలుస్తారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానాన్ని స్వాగతిస్తున్నట్లు చంద్ర‌బాబు పున‌రుద్ఘాటించారు. ప్రతి మూడు నెలలకు ఒసారి ఎన్నికలు జరగడం సరికాదన్నారు. ప్రతిసారీ ఎన్నికలు జరిగినప్పుడు ఇబ్బందిపడే కంటే ఒకేసారి ఇబ్బందిపడితే సరిపోతుంది కదా! అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు సీతాదేవికి శీలపరీక్షలా ఉన్నాయని విస్మ‌య‌క‌ర పోలిక‌ను ప్ర‌స్తావించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ పార్టీల ఆధిపత్యం పెరుగుతుందన్న వాదన కరెక్టు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుస్థిర పాలన అవసరమన్నారు. సుస్థిర పాలన రాష్ట్రంలో ఉంది కనుకే పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు హైదరాబాద్ పాకిస్తాన్‌లో ఉందా? అని అడిగేవారని, ఆంధ్రప్రదేశ్‌ లో ఉందంటే ఎలా రావాలని ప్రశ్నించేవారన్నారు. వీటన్నింటనీ దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలని కేంద్రాన్ని ఒప్పించానన్నారు. ఆలోచనా విధానం సరిగా ఉంటే అన్నీ అర్థమ‌వుతాయని పరోక్షంగా జగన్‌ను ప్రస్తావిస్తూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News