పూలంటే చంద్రబాబుకు భయమేమో!

Update: 2016-08-31 04:50 GMT
తమ ప్రాంతానికి పెద్దస్థాయి నాయకుడు వస్తున్నారంటే.. వారికి స్థానిక నేతలు ఎలా గౌరవప్రదమైన స్వాగతం చెప్పాలి. ఆలయాలు వంటి చోట్ల అయితే.. ఏదో పూర్ణకుంభం పెట్టి - ఎర్రతివాచీ పరచి హడావుడి చేస్తారు. అదే కరవు ప్రాంతాలు - ఎండిపోయిన పొలాల వద్దకు నాయకులు వస్తోంటే.. వచ్చే నాయకుల గౌరవం కోసం కనీసం ఓ పూలబొకే అయినా ఇచ్చి స్వాగతం చెప్పాలని స్థానిక నేతలు అనుకుంటారు. అయితే పూలబొకేలు తెచ్చిన పాపానికి వారెవ్వరికీ కరవు రైతుల మీద సానుభూతి లేదన్నట్లుగా వచ్చిన నాయకుడే తప్పు పడితే ఎలా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనలో నడిపించిన డ్రామా అలాగే కనిపిస్తోంది.

అనంతపురం జిల్లా గణపతి పల్లిలో చంద్రబాబునాయుడు మంగళవారం నాడు పర్యటించారు. అక్కడి కరవు రైతులను పరామర్శించి, కరవు ప్రాంతాల్లో తిరగడం ఆయన ఎజెండా. సహజంగానే స్థానిక నాయకులు ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పడానికి పుష్పగుచ్ఛాలతో వచ్చారు. కరవు రైతుల ముందు ఆయన కాస్త బిల్డప్‌ ఇవ్వదలచుకున్నారో ఏమో గానీ.. రైతులను పరామర్శించడానికి వస్తే పుష్పగుచ్ఛాలెందుకు తెచ్చారు అంటూ.. ఆ నాయకులమీద చిర్రుబుర్రు మన్నారు. వాళ్లకేదో రైతుల మీద జాలి లేనట్లుగా తనకు మాత్రమే ఉన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చారు.

గతంలో పూలమాల రూపంలో రాజీవ్‌ గాంధీని మృత్యువు కబళించినప్పుడు.. దేశంలోని నాయకులంతా పూలమాలలతో స్వాగతాలకు బెంబేలెత్తిపోయారు. పూలమాలల సంస్కృతికి తెరపడింది. చివరికి ఇప్పుడు చంద్రబాబు పూలబొకేలకు భయపడుతున్నాడా? లేదా కరవు రైతుల ముందు కాస్త బిల్డప్‌ ఇచ్చారా అనేది స్థానిక నాయకులకు డౌటుగా మారింది. అయినా సీఎం తమ ప్రాంతానికి వచ్చినప్పుడు.. బొకేలు ఇవ్వడం కాకుండా ఏం చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. కరవు ప్రాంతానికి వచ్చినందుకు గుర్తుగా బీడు పడ్డ నేలల ఫోటోలు జ్ఞాపికలా ఇచ్చి సీఎంను స్వాగతించాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News