జగన్ కు 30 ఏళ్ళు జైలుశిక్ష తప్పదట... బాబు ఆ విషయం మరిచారే ?

Update: 2020-10-17 11:30 GMT
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి 10-30 ఏళ్ళ జైలు శిక్ష పడటం ఖాయమేనా ? తాజాగా చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చూస్తే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ సంస్ధ విడుదల చేసిన నివేదికలో స్పష్టంగా ఉందని చంద్రబాబు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే కోర్టు విచారణలో ఉన్న కేసుల పై బయట ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని న్యాయవ్యవస్ధ గతంలోనే స్పష్టం చేసింది. అయినా ఏదో సంస్ధ నివేదికలో ఉందని చెప్పి జగన్ కు 30 ఏళ్ళ జైలుశిక్ష పడటం ఖాయమని చెప్పటంలో అర్ధమేమిటో.

సరే చంద్రబాబు వ్యాఖ్యలను పక్కనపెట్టేస్తే జగన్ మీద అవినీతి కేసులు దాదాపు 11 ఏళ్ళుగా విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్టయిన చాలామంది ఉన్నతాధికారులపై సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు కేసులు కొట్టేసింది. జగన్ ఒత్తిడి వల్లే ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు పెట్టి చాలామందిని అరెస్టు చేసింది. అయితే తర్వాత జరిగిన విచారణలో ఉన్నతాధికారులపై నమోదు చేసిన కేసుల్లో సీబీఐ సాక్ష్యాధారాలను చూపలేకపోయింది. దాంతో ఐఏఎస్ అధికారుల అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, ఏసీబీ కోర్టులు చాలామందిపై కేసులను కొట్టేసింది.

ఇదే సమయంలో విచారణ ప్రారంభంలోనే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై తన మంత్రివర్గానికి ఎటువంటి సంబంధం లేదని దాఖలు చేసిన అఫిడవిట్ ను కోర్టు అంగీకరించింది. అంటే నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గానికి సంబంధం లేదు. అమలు చేసిన ఉన్నతాధికారులకూ సంబంధాలు, అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాలూ లేవు. అదే విధంగా తమను జగన్ ఒత్తిడి పెట్టాడని కానీ లేదా మోసం చేశాడని కానీ ఏ పారిశ్రామికవేత్త, వ్యాపారావేత్త కూడా ఎక్కడా ఫిర్యాదు చేయలేదు.

జగన్ పైన ప్రధానంగా ఉన్న క్విడ్ ప్రో కో ఆరోపణలకు సంబంధించి పారిశ్రామికవేత్తలపై సీబీఐ పెట్టిన కేసులు అసంబద్ధంగా ఉన్నాయంటూ కోర్టే అభిప్రాయపడిన విషయం తెలిసిందే. అన్నిటికన్నా మించి అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చిన సమయంలో అసలు జగన్ కు ప్రభుత్వంలో ఎటువంటి పదవులు లేవు. ఎటువంటి పదవిలోను లేని జగన్ ప్రభుత్వాన్ని ఏ పద్దతిలో ప్రభావితం చేశాడు ? ఏ విధంగా తనకు అనుకూలంగా ఒత్తిడి తెచ్చారన్నది అసలైన ప్రశ్న. సరే ఈ విషయాలన్నీ కోర్టు విచారణలో ఇపుడు తేలిపోతాయి. మరి ఏ ఆధారాలతో అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ తన నివేదికలో జగన్ కు శిక్ష పడుతుందని చెప్పిందో తెలీదు. దాన్ని పట్టుకుని చంద్రబాబు గుంటూరు లోక్ సభ నేతలతో మాట్లాడుతూ చెప్పటం ఏమిటో.
Tags:    

Similar News