గేటుకు గ్రీజు పెట్టలేరు..3 రాజధానులు కడతారా?

Update: 2021-12-04 12:14 GMT
ఇటీవల కురిసిన వరదల వల్ల కడపలోని అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. చెయ్యేరు నదికి వరద పోటెత్తి అన్నమయ్య ప్రాజెక్టు మట్టి ఆనకట్ట కొట్టుకుపోవడంతో 62 మంది మృత్యువాత పడ్టారు. అంతేకాదు, ఆ ప్రభావంతో పలు కుటుంబాలు ఇళ్లు, పంటపొలాలు, నగదు నట్రా, గొడ్డు గోదా.. ఇలా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో వీధినపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

బాధ్యతలకు భయపడితే జగన్ కు సీఎంగా ఉండే అర్హతే లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్‌కు గ్రీజు కూడా పెట్టలేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మిస్తారా? అని ఎద్దేవా చేశారు. వరద ప్రభావంతో జనం జీవన్మరణ సమస్య ఎదుర్కొంటున్నారని, వారిని రక్షించే బాధ్యత జగన్‌ది కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని, ప్రజలు తెలిసో తెలియకో ఓట్లేసిన పాపానికి వారి ప్రాణాలు తీస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.

వరద వస్తుందని వాతావారణ శాఖ ముందే హెచ్చరించినా జగన్ స్పందించలేదని ఆరోపించారు. ఈ విపత్తుకు బాధ్యులైన వారందరినీ శిక్షించాలని, జగన్ వైఫల్యం వల్లే ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదం వల్లే 62 మంది మరణించారని, రూ. 6 వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగిందని ఆరోపించారు. గతంలో వరదలు వస్తే అన్నమయ్య ప్రాజెక్ట గేటు తెరిచే ఉంచేవారని, నీరు వృథాగా పోయి ప్రాణనష్టం జరిగేది కాదని అన్నారు.

కానీ, ఈ సారి వరదలకు ఆ గేట్ ఓపెన్ కాలేదని చెబుతున్నారని, గేట్ సమస్య అప్పటికప్పుడు వచ్చింది కాదని అన్నారు. ఇసుక కోసం నదిలోకి వెళ్లిన టిప్పర్‌ల కోసమే నీటిని విడుల చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News