నిన్న తగ్గించి ఇవాళ పెంచారే !

Update: 2015-12-16 08:05 GMT
కోటి ఆశలు పెట్టుకున్న మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు సగటుజీవికి తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి. యూపీఏ హయాంలో పెరిగిన జీవన వ్యయం.. అవినీతి నేపథ్యంలో మోడీ లాంటి నేత ప్రధాని అయితే.. దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని.. పెరిగిన ధరలు భారీగా తగ్గుతాయన్న నమ్మకం ఉండేది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.. తీవ్ర అసంతృప్తికి గురి అయ్యేలా చేస్తుంది.

తరచూ ఏదో ఒక పన్ను పేరుతో అంతోఇంతో వడ్డింపులే తప్పించి.. సగటుజీవి ఊపిరి పీల్చుకునే చర్యలు మాత్రం చేపట్టటం లేదు. నిజానికి మన్మోహన్ సింగ్ కు లేని అదృష్టం.. మోడీకి ఉన్నలక్ ఏమిటంటే.. అంతర్జాతీయంగా కొన్ని పరిణామాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మీద పన్నుల భారం పడకుండా.. వస్తుధరల విషయంలో కఠినంగా వ్యవహరించి.. పెరిగిన ధరలకు ముకుతాడు వేయాల్సి ఉన్నా.. మోడీ సర్కారు అలాంటివేమీ పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు.

సమకాలీనకాలంలో ఎన్నడూ లేనంత భారీగా ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పడిపోయాయి. యూపీఏ హయాంలో బ్యారెల్ ముడిచమురు ధరలు 110 అమెరికా డాలర్లు పలికిన స్థానే ఇప్పుడు 39 డాలర్లు మాత్రమే పలుకుతోంది. అయినప్పటికీ పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గేంచే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. తాజాగా పడిపోయిన ముడిచమురు ధరల నేపథ్యంలో లీటరు పెట్రోలుకు రూ.4 మేర తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమైనప్పటికీ మంగళవారం తగ్గించింది 50 పైసలు మాత్రమే. మరీ.. ఇంత తక్కువా అన్న మాట పూర్తికాక ముందే.. షాక్ తగిలించే మరో నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది.
Read more!

నిన్న లీటరు పెట్రోల్ కు 50 పైసలు తగ్గించిన కేంద్రం.. నేడు పెట్రోల్.. డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని తగ్గిన 50 పైసలు పెట్రోల్ ధరలో మరో 30 పైసలు పెరగనున్నాయి. ఇక.. డీజిల్ లీటర్ మీద తగ్గించిన 46 పైసలకు బదులుగా తాజాగా పెంచిన ఎక్సైజ్ సుంకం పుణ్యమా అని డీజిల్ ధర లీటరుకు రూ.1.17 చొప్పున పెరగనుంది. కేవలం ఒక్క రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ మార్పులపై సగటుజీవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
Tags:    

Similar News