రైతు సంఘాలతో చర్చలకు సిద్దమైన కేంద్రం .. డిసెంబర్ 3 న భేటీ !

Update: 2020-11-27 16:10 GMT
దేశానికీ వెన్నెముక రైతు. అయితే , ఆ రైతుకి పూట గడవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. వచ్చే కరువులు , లేకపోతే వరదలు. ఇలా కాకపోతే ప్రభుత్వం తీసుకొనే అనూహ్య నిర్ణయాలు , వీటితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కేంద్రం లో ఉన్న మోడీ సర్కార్ కొన్ని రైతు చట్టాలని తీసుకువచ్చింది. అయితే ,  వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అన్నదాతలతో చర్చలకు  కేంద్రం  సుముఖత వ్యక్తం చేసింది. సహనంతో ఉండాలని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.

డిసెంబరు 3 న వివిధ రైతు సంఘాల ప్రతిధులతో చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు. గతంలో కూడా తాము సంప్రదింపులు జరిపామని, ప్రస్తుతం సిద్ధంగా  ఉన్నామని ఆయన చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆయన అన్నారు.  వీరి సమస్యలను తమ రాజకీయ ప్రయోజనాలకు కాంగ్రెస్ సహా విపక్షాలు ఉపయోగించు కుంటున్నాయని తోమర్ తెలిపారు. కాగా ఇప్పటికే వ్యవసాయ మంత్రిత్వ శాఖ 32 రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది.

ఇలా ఉండగా రైతు చట్టాలను పార్లమెంటు ఆమోదించిన అనంతరం కూడా వివిద రైతు సంఘాలు వీటిని నిరసిస్తూ ఆందోళనకు దిగగా అప్పుడు కూడా వీరిని కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. వీరు వ్యవసాయ శాఖ మంత్రిత్వ కార్యాలయానికి చేరుకోగా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చల్లో పాల్గొనకుండా గైర్ హాజరయ్యారు. తమ శాఖ కార్యదర్శి చర్చలు జరుపుతారని ప్రకటించారు. అయితే రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహించి..స్వయంగా మంత్రే రావాలంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ కార్యాలయంలోనే వారు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వెనక్కి మళ్లారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తరాదని అన్నదాతలు అంటున్నారు. తమ సమస్యలను బీజేపీ కూడా రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని ఆరోపణలు చేస్తున్నారు.
Tags:    

Similar News